పార్లమెంట్లో టీడీపీ పోరాటం
పాలన వికేంద్రీకరణ పేరుతో రాజధానిని తరలించేందుకు, అమరావతిని నాశనం చేసేందుకు జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరిగింది. జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్), జాతీయ పౌర జాబితా( ఎన్ఆర్సీ)లపై ముస్లింలలో నెలకొన్న భయాందోళనలను కేంద్రం తొలగించేవరకు వాటిని వ్యతిరేకించాలని టీడీపీ నిర్ణయించింది.
రాజధాని రైతులు, మహిళలపై పోలీసుల లాఠీఛార్జి, అరెస్టుల అంశాన్ని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ మానవ హక్కుల కమిషన్ల దృష్టికి తీసుకెళ్లాలని, పార్లమెంటులోనూ ప్రస్తావించాలని నిర్ణయించారు. మొత్తం తొమ్మిది అంశాలపై చర్చ జరిగింది. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్, కె.రామ్మోహన్ నాయుడు, సీతారామలక్ష్మి మీడియాకు వివరించారు. మరో ఎంపీ కేశినేని నాని ఢిల్లీలో ఉండటంతో ఈ సమావేశానికి హాజరుకాలేదు.













