తుఫాను బాధితులకు టీడీపీ శ్రేణులు అండగా నిలవాలి : చంద్రబాబు
గులాబ్ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారని, తీరం వెంబడి బలమైన గాలులు వీస్తుండంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. తుఫాను ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు తమ వంతు సాయం అందజేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర సరకులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించడంలో సహాయం అందించాలని తెలిపారు. బాధితులకు టీడీపీ శ్రేణులు అన్ని విధాల అండగా నిలవాలన్నారు.
గులాబ్ తుఫాను ప్రభావంపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సరఫరాకు అటంకం కలుగకుండా అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు చర్యలు చేపట్టి నష్టాన్ని నివారించాలని ప్రభుత్వాన్ని సూచించారు.













