ఎన్నికల ముందు ఒకటి చెప్పి.. అధికారంలోకి వచ్చాక మరొకటి
ప్రకాశించని నవరత్నాలు జగన్ మోసపు లీలలు పేరిట టీడీపీ రూపొందించిన వాస్తవ పత్రాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశారనడం అవాస్తవమని విమర్శించారు. జగన్ చెప్పేవన్నీ అసత్యాలేనని, ఒక్కటీ నిజం ఉండదని ఆరోపించారు. ఎన్నికల ముందు ఒకటి చెప్పి, అధికారంలోకి వచ్చాక మరొకటి చేస్తున్నారని విమర్శించారు. అమ్మఒడి కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పి, రూ.13 వేలు ఇస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 84 లక్షల మంది ఉంటే 42 లక్షల మందికే పథకాన్ని వర్తింపజేయటం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం కార్యక్రమం తీసుకొచ్చి ప్రతి మహిళలకు రూ.15 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. గతంలో పింఛన్ రూ.200 ఉంటే రూ.1800 పెంచి రూ.2 వేలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మందుల కొరత లేకుండా చేశామని తెలిపారు. గత నాలుగేళ్ల వైసీపీ పాలనలో పేదవాడికి సరైన వైద్యం అందుతోందా? అని ప్రశ్నించారు.
మేం 74 లక్షల మందికి పింఛన్ ఇస్తే మీరు 62 లక్షల మందికే ఇస్తారా? వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల మందికి పింఛన్లు తొలగించడం వాస్తవం కాదా? ఏవేవో సాకులతో పేదవాడి పథకాలన్నీ తీసేసి మోసం చేస్తున్నారు. రైతు భరోసా కింద 12 హామీలిచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 8 హామీల్లో ఒక్కటీ అమలు కాలేదు. పించన్ల పెంపు కింద ఇచ్చిన 3 హామీల్లో 2 అమలు కాలేదు. అమ్మఒడి కింద ఇచ్చిన 2 హామీలు కూడా పెండిరగ్లోనే ఉన్నాయి. పేదలందరికీ ఇళ్లు పేరిట ఇచ్చిన 5 హామీలూ అమలు కాలేదు. బోధనారుసుం కింద ఇచ్చిన 2 హామీల్లో ఒక్కటీ అమలు కాలేదు. వైఎస్ఆర్ జలయజ్ఞం కింద ఇచ్చిన హామీలన్నీ పెండిరగ్లోనే ఉన్నాయి. మద్య నిషేధమంటూ ఇచ్చిన హామీ కూడా ఇంతవరకు అమలు చేయలేదు అని ఆరోపించారు.













