విదేశీ పెట్టుబడుల కోసం టాస్క్ఫోర్స్ : ఎపి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను, పరిశ్రమలను ఆకర్షించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దీని కోసం ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి నేతృత్వం వహించే ఈ కమిటీలో 8 మంది వివిధ హోదాలకు చెందిన ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు. విభిన్న రంగాలవైపుగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఈ కమిటీలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలెవన్, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆడిత్యనాథ్ దాస్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఇంధన, ఐటీ శాఖ కార్యదర్శులు శ్రీకాంత్, కొనశశిధర్, పరిశ్రమ ల శాఖ డైరెక్టర్, ఈడీబి సీఈఓ సుబ్రహ్మణ్యం లు సభ్యులుగా నియమితులయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా విదేశీ పెట్టుబడులను ఆకట్టుకునేందుకు గాను ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చేస్తున్న ఆలోచన కార్యరూపం దాల్చింది. ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు, కోవిడ్ 19 వ్యాప్తి, పుట్టుక కారణాల నేపథ్యంలో చైనా నుంచి పలు దేశాలకు మరీ ముఖ్యంగా భారత్ కు తరలి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న వివిధ దేశాల పరిశ్రమలను రాష్ట్రం వైపుగా మళ్లించేలా ఈ టాస్క్ ఫోర్స్ కమిటి కి బాధ్యతలు అప్పగించారు.













