నందిగామలో ఉచిత కంటి వైద్య శిబిరానికి అనూహ్య స్పందన
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రతినిధి నందిగామకు చెందిన వాసిరెడ్డి వంశీ ఆధ్వర్యంలో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు గారు, తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ గారు, కార్యనిర్వహక ఉపాధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు గారు, సహకారంతో గుంటూరు జిల్లా పెదకాకాని లోని శంకర్ కంటి వైద్యశాల సంయుక్తంగా శ్రీ గౌతం హైస్కూల్ లో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది.
ఈ శిబిరంలో 427 మందికి వైద్య పరీక్షలు నిర్వహించటం జరిగినది. వీరిలో 198 మందికి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. అందరికీ శంకర్ కంటి వైద్య శాల లో ఉచితంగా ఆపరేషన్ చేయబడునని వైద్యులు తెలిపారు.
ఈ శిబిరాన్ని నందిగామ డిఎస్పీ నాగేశ్వర్ రెడ్డిగారు, నగర పంచాయతీ కమిషనర్ జయరాంగారు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు ప్రారంభించారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శాఖమూరు స్వర్ణలత గారు ఈ మెగా క్యాంప్ ను సమన్వయం చేసారు. కంటి వైద్య శిబిరానికి తరలివచ్చిన ప్రజలకు శంకర్ నేత్రాలయ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో పాటు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు.
ఈ మెగా ఐ క్యాంపు కార్యక్రమాన్ని తానా న్యూజెర్సీ రీజనల్ రిప్రెజెంటేటివ్ వంశీ వాసిరెడ్ది స్పాన్సర్ చేయగా, తానా ఫౌండేషన్ ట్రస్టీ సుమంత్ రామిసెట్టి గారు సమన్వయకర్త గా వ్యవహరించారు.













