ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి పోస్టులకు నలుగురు న్యాయవాదులను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నాల నేతృత్వంలోని కొలీజియం న్యాయవాదులు హరినాథ్ నూనెపల్లి, కిరణ్మయి మండవ, సుమతి జగడం, న్యాపతి విజయ్ పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేస్తున్న ఇద్దరు అత్యంత సీనియర్ న్యాయమూర్తులతో సంప్రదించి ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫిబ్రవరి 22న ఈ నలుగురు న్యాయవాదుల పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు సిఫార్సు చేశారు అని కొలీజియం తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం వీరి సీనియారిటీని నిర్ణయించనున్నట్లు పేర్కొంది.













