పంచాయతీ రాజ్ సంస్థల బలోపేతానికి రాజీవ్ గాంధీ చేపట్టిన సంస్కరణలు భారత గ్రామీణాభివృద్ధికి దిక్సూచి: శ్రీ హెచ్ కె పాటిల్ అభిభాషణ
తిరుపతి, ఆగస్టు 22: భారతదేశంలోని పంచాయతీ రాజ్ సంస్థల పటిష్టతకు ప్రధానమంత్రిగా శ్రీ రాజీవ్ గాంధీ చేసిన కృషి మరియు చేపట్టిన సంస్కరణలు చిరస్మరణీయమైనవని కర్ణాటక రాష్ట్ర న్యాయ, శాసన వ్యవహారాలు మరియు పర్యాటక శాఖల మంత్రి శ్రీ హెచ్. కె. పాటిల్ అభివర్ణించారు.
18వ రాజీవ్ గాంధీ స్మారక ఉపన్యాసం మరియు రాజీవ్ గాంధీ జాతీయ పురస్కారాల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా భారత గ్రామీణ అధ్యయనం మరియు పరిశోధన అకాడమీ (అగ్రశ్రీ) ఆధ్వర్యంలో ‘భారత దేశంలో పంచాయతీ రాజ్ సంస్థలు: వాటిని బలోపేతం చేయడం ఎలా?’, అనే అంశంపై బెంగుళూరు లోని గాంధీభవన్ ఆడిటోరియంలో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న హెచ్. కె. పాటిల్ మాట్లాడుతూ, 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దేశంలోని పల్లె సీమల్లో నిధులు, విధులు, అధికారాలు సాధించి ప్రగతి పథంలో పయనిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే, రాజీవ్ గాంధీ కలలుగన్న ‘ప్రజలకే అధికారం’ అనే నినాదం పూర్తిగా రూపాంతరం చెందకపోవడం శోచనీయమని వివరించారు.
భారతదేశంలోని గ్రామ సీమలు అన్ని రంగాల్లో పురోగమించాలంటే పంచాయతీలకు 73వ రాజ్యాంగ సవరణ చట్టం కల్పించిన విధివిధానాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయాలకు అతీతంగా అమలు చేయాలని, అలా చేసినప్పుడే గాంధీజీ కలలుగన్న ‘గ్రామ స్వరాజ్యం’, రాజీవ్ గాంధీ ఆశించిన ‘ప్రజలకే అధికారం’ అనే లక్ష్యాలు సార్థకం అవుతాయని హెచ్.కె. పాటిల్ స్పష్టం చేశారు.
అగ్రశ్రీ సంచాలకుడు డాక్టర్ డి. సుందరరామ్ అనుసంధానకర్తగా వ్యవహరించిన సదస్సుకు కర్ణాటక రాష్ట్ర శాసనమండలి మాజీ అధ్యక్షుడు ఆచార్య బి. కే. చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు.
ఉపన్యాసకులుగా లోక్ సభ మాజీ సభ్యుడు శ్రీ సి. నారాయణ స్వామి, కర్ణాటక రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు శ్రీ ప్రమోద్ హెగ్డే, కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్ పరిషత్ ఉపాధ్యక్షుడు శ్రీ వెంకట్రావు వై గోర్పడే, ఎర్నాకులం జిల్లా పంచాయతీ అధ్యక్షుడు శ్రీ ఉల్లాస్ థామస్, తమిళనాడులోని మానచ్చనల్లూరు తాలూకా పంచాయతీ అధ్యక్షుడు శ్రీ ఆర్. శ్రీధర్, ఆంధ్రప్రదేశ్ లోని విస్సాకోడూరు గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీ బి శ్రీనివాస్, బెంగళూరులోని ఆర్థిక మరియు సాంఘిక పరివర్తన సంస్థ సంచాలకుడు ఆచార్య డి. రాజశేఖర్ మరియు సహాయ ఆచార్యురాలు డాక్టర్ ఆర్. మంజుల తదితరులు పాల్గొని తమ తమ పరిశోధన పత్రాలను సమర్పించారు.
కర్ణాటక మాజీ ఎమ్మెల్యే శ్రీ డి.ఆర్. పాటిల్, హైదరాబాదులోని ఆర్థిక మరియు సాంఘిక అధ్యయనాల సంస్థ సీనియర్ పరిశోధక నిపుణులు ఆచార్య ఎం. గోపీనాథ్ రెడ్డి, గదక్ లోని కర్ణాటక రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఎన్. శివన్న మరియు ప్రొఫెసర్ ఎం. దేవేంద్రబాబులు విశ్లేషకులుగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణల నుండి ఎన్నికైన పంచాయతీ రాజ్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో
పాల్గొని నిర్దిష్ట సూచనలతో చర్చల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అగ్రశ్రీ సంస్థ నెలకొల్పిన రాజీవ్ గాంధీ జాతీయ పురస్కారాలను ఆరు రంగాల్లో విశిష్ట సేవలను అందించిన ప్రముఖులకు, మెమెంటోలు మరియు అనులేఖనాలతో ముఖ్య అతిథి ప్రధానం చేశారు.
రాజీవ్ గాంధీ జాతీయ పురస్కార గ్రహీతలు: ప్రొఫెసర్ బి. కె. చంద్రశేఖర్, మాజీ ఛైర్మన్, కర్ణాటక రాష్ట్ర శాసన మండలి (రాజీవ్ గాంధీ అత్యుత్తమ నాయకత్వ జాతీయ పురస్కారం); ప్రొఫెసర్ ప్రియా అబ్రహం, మాజీ డైరెక్టర్, ICMR – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పూణే (రాజీవ్ గాంధీ మహిళా శక్తి జాతీయ పురస్కారం); ప్రొఫెసర్ ఎం. గోపీనాథ్ రెడ్డి, సీనియర్ రీసెర్చ్ కన్సల్టెంట్, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్, హైదరాబాద్ (రాజీవ్ గాంధీ గ్రామ స్వరాజ్ జాతీయ పురస్కారం); శ్రీ ఉల్లాస్ థామస్, అధ్యక్షుడు, ఎర్నాకులం జిల్లా పంచాయతీ, కేరళ (రాజీవ్ గాంధీ ఉత్తమ జిల్లా పంచాయతీ జాతీయ పురస్కారం); శ్రీ ఆర్. శ్రీధర్, చైర్మన్, మన్నచనల్లూర్ పంచాయతీ యూనియన్ కౌన్సిల్, తిరుచిరాపల్లి జిల్లా, తమిళనాడు (రాజీవ్ గాంధీ ఉత్తమ తాలూకా పంచాయతీ జాతీయ పురస్కారం) మరియు శ్రీ బి. శ్రీనివాస్, సర్పంచ్, విస్సాకోడేరు గ్రామ పంచాయతీ, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ (రాజీవ్ గాంధీ ఉత్తమ గ్రామ పంచాయతీ జాతీయ పురస్కారం).
కర్ణాటక రాష్ట్ర శాసనమండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ బి.కె. చంద్రశేఖర్, ’73వ రాజ్యాంగ సవరణ చట్టం ఆవిర్భావం: స్థితి, అమలు మరియు సవాళ్లు’ అనే అంశంపై 18వ రాజీవ్‌గాంధీ స్మారక ఉపన్యాసం చేస్తూ, గ్రామాలలో సుస్థిరమైన అభివృద్ధిలో ఏకైక ముఖ్య లక్షణమైన పంచాయతీ రాజ్ రంగానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత మరియు శ్రద్ధ వహించాలని ప్రొఫెసర్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.
కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్ పరిషత్ ఉపాధ్యక్షుడు శ్రీ వెంకట్రావు వై.గోర్పడే అధ్యక్షత వహించారు.
అగ్రశ్రీ సంస్థ నెలకొల్పిన రాజీవ్ గాంధీ స్మారక ఉపన్యాసం మరియు జాతీయ పురస్కారాల లక్ష్యాలను అగ్రశ్రీ సంచాలకుడు డాక్టర్ సుందర్ రామ్ వివరించారు.
ఈ సందర్భంగా అగ్రశ్రీ సంస్థ ప్రచురించిన రాజీవ్ గాంధీ విశేష సంచికను ముఖ్యఅతిథి విడుదల చేశారు.
అగ్రశ్రీ ఉపాధ్యక్షుడు డి. సాయి కుమార్ వందన సమర్పణ చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీరాజ్ సంస్థల బలోపేతానికి చేపట్టవలసిన అంశాలకు సంబంధించి అగ్రశ్రీ సంస్థ రూపొందించిన సిఫార్సులను సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది.













