సాఫ్ట్ వేర్ శిక్షణ కేంద్రంగా అమరావతి
అమరావతి నగరం ఇప్పుడు ఐటీ కంపెనీలతో, సాఫ్ట్వేర్ శిక్షణ కేంద్రాలతో కళకళలాడుతోంది. ఎస్ఏపీ, ఒరాకిల్, పీహెచ్‌పీ, ఎస్‌క్యూఎల్, డాట్ నెట్ వంటి రకరకాల సాఫ్ట్వేర్ కోర్సులకు అమరావతిని హబ్‌గా మార్చేందుకు ప్రవాసాంధ్రుల సంఘం (ఏపీ ఎన్ఆర్టీ) చొరవ చూపుతోంది. ప్రస్తుతం యువత ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకుని వివిధ సాఫ్ట్వేర్ కోర్సులను నేర్చుకునేందుకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల బాట పడుతున్నారు. అక్కడే ఉద్యోగాలు వెతుక్కుని స్థిరపడుతున్నారు. అదే సాఫ్ట్వేర్ శిక్షణ సంస్థలు స్థానికంగా అందుబాటులో ఉంటే రాజధాని ప్రాంతంలో ఐటీ రంగం వృద్ధి చెందే అవకాశాలుంటాయన్న ఉద్దేశంతోనే బెంగళూరు, పుణె, హైదరాబాద్ నగరాల్లోని ప్రముఖ సాఫ్ట్వేర్ శిక్షణ సంస్థలు తమ శాఖలను అమరావతిలో నెలకొల్పేలా ఏపీ ఎన్ఆర్టి ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి అవసరమైన కార్యాలయస్థలంతోపాటు, రూ.కోటిన్నర వరకూ ఏకకాల పెట్టుబడిని ప్రభుత్వమే సమకూరుస్తోంది. ఈ క్రమంలో ఏడాది కాలంలో 15 శిక్షణ సంస్థలు అమరావతిలో తమ శాఖలను నెలకొల్పి కార్యకలాపాలు ప్రారంభించాయి. మరిన్ని శిక్షణ సంస్థల కోసం మంగళగిరి-గూంటూరు జాతీయ రహదారి పక్కనే ఓ వాణిజ్య భవనాన్ని లీజుకు తీసుకున్నారు.
ఇప్పటికే రాజధాని ప్రాంతంలో 60 వరకూ సాఫ్ట్వేర్ సంస్థలు ఉండగా, వాటికి నైపుణ్యాలున్న ఉద్యోగులు దొరకడం కష్టంగా మారింది. దీనివల్ల కొన్ని కంపెనీలు తిరిగి వెళ్లిపోయే పరిస్థితికొచ్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా సంస్థల అవసరాల మేరకు శిక్షణ పొందిన వారికి ఉద్యోగాలు కల్పించనున్నారు.













