మళ్లీ ఆ స్టార్ హోటల్ చుట్టూనే ఏపీ రాజకీయాలు…
కొన్ని స్టార్స్ అంతే… ఆకాశంలో ఉంటూనే నేలపై ఉన్న మనుషుల తల రాతలు మారుస్తుంటాయి. ఓ వర్ధమాన సినీనటిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టించి ఆమె భవిష్యత్తుని ప్రశ్నార్ధకం చేసి దీని వెనుక రాజకీయనేత ఉన్నారనేది వాస్తవం అనిపించేలా చేసిందీ ఆ స్టార్ హోటలే. ఓ మాజీ ముఖ్యమంత్రి తన కుటుంబంతో సహా అక్కడ కొంతకాలం పాటు తిష్టవేసి ప్రజాధనాన్ని అద్దె రూపంలో చెల్లించారంటూ దుమారం రేగిందీ అదే స్టార్ హోటల్లో. ఓ దర్శకుడ్ని ఆయన భార్య ఓ యువనటితో ఉండగా పట్టుకుందనే పుకారుకు కేంద్రబిందువైందీ అదే స్టార్ హోటల్. ఇలా అనేక సంచలనాలకు నెలవైన స్టార్‌హోటల్ ఏపీ రాజకీయాలలో కొత్త దుమారానికి కారణమైంది.
గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని‘కుల’ రాజకీయం వేడెక్కుతోంది. స్థానిక ఎన్నికలను ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేయడం అది కులపరమైన నిర్ణ“యంగా ఆరోపించడంతో మొదలైందీ సంకుల సమరం…తాజాగా ప్రజెలెన్నుకున్న ప్రభుత్వానికి గతంలోని అధికార పార్టీ నియమించిన అధికారికీ మధ్య నిర్విరామంగా సాగుతున్న పోరు… కొత్త మలుపు తిరిగింది. ఇప్పటిదాకా రాజ్యాంగం, న్యాయ స్థానం, హక్కులు, విధులు చుట్టూ తిరిగిన ఈ వివాదం ఇప్పుడు స్టార్ హోటల్ నీడకు చేరింది.
ఏపీ ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్, భాజాపా ఎంపీ సుజనా చౌదరి, మరో భాజాపా నేత కామినేని శ్రీనివాస్‌లు ఈ నెల 13న రహస్యంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్లో పమావేశం అయిన సంగతి బయటకు పొక్కింది. వీరు ముగ్గురూ ఒక హోటల్ గదిలోకి వెళ్లడం తర్వాత విడి విడిగా తిరిగి రావడం వీడియో సాక్ష్యంగా మంగళవారం బయట పడింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపింది.
దీంతో ఇదే విషయంపై మంగళవారం అంతా మీడియాలో చర్చోపచర్చలు నడిచాయి. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారి రాజకీయ పార్టీ నేతలతో అదీ రహస్యంగా కలవడం ఎంత మేరకు సబబు అన్న ప్రశ్నలు ఊపందుకున్నాయి. దీంతో భాజాపా నేతలు డిఫెన్స్‌లో పడ్డారు. నిజానికి సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లు బిజేపీలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ మద్ధతుదారులుగానే ముద్రపడ్డారు. ఈ నేపధ్యంలో ప్రస్తుతం ఎపీ ప్రభుత్వంతో ప్రత్యక్ష న్యాయ యుద్ధానికి దిగిన రమేష్ కుమార్ వీరిని కలవడం వైసీపీ వాదనకు బలం చేకూర్చినట్టయింది.
దీనిపై ఆత్మరక్షణలో పడిన సుజనా చౌదరి…పార్క్ హయత్ హోటల్ నుంచే తాను కార్యకలపాలు నిర్వహిస్తుంటానన్నారు. తాను రమేష్‌కుమార్‌ని కలవడం నిజమేనని, అందులో రహస్యమేమీ లేదని చెప్పారు. అదే సమయంలో కామినేని రావడం యాథృఛ్చికమేనన్నారు. తనదంతా పారద్శక రాజకీయమని చెప్పుకొచ్చారు. మరోవైపు కామినేని కూడా తన వాదన వినిపించారు. తాను సుజనా చౌదరి అపాయింట్ మెంట్ తీసుకుని హోటల్‌కి వెళ్లానని అక్కడ రమేష్‌కుమార్ కనిపిస్తే కంగ్రాట్స్ మాత్రమే చెప్పానన్నారు. ఇందులో చంద్రబాబు ప్రస్తావనే రాలేదన్నారు. పార్టీ అనుమతితోనే నిమ్మగడ్డకు మద్ధతుగా న్యాయస్థానంలో కేసు వేశానన్నారు. పార్క్ హయత్ హోటల్ ఏమీ ప్రైవేట్ ప్లేస్ కాదని అది పబ్లిక్ ప్లేసేనన్నారు. తానేమైనా తప్పు చేశానని నిరూపిస్తే ఆస్తి మొత్తం రాసిస్తానంటూ సవాల్ చేశారు.
మరోవైపు వైసీపీ నేతలు, అంబటి రాంబాబు, మంత్రి సుచరితలు… ఇదంతా బాబు పన్నాగమేనని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో వీరంతా భాగస్తులని ఆరోపించారు. ఈ వివాదంపై భాజాపా అధిస్టానం కూడా స్పందించి సుజనా, కామినేనిల నుంచి వివరణ కోరినట్టు సమాచారం. ఒక ఎన్నికల అధికారిని రహస్యంగా కలవాల్సిన అవసరాన్ని ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రభుత్వ నిర్ణయాలపై పోరాటం చేయమన్నామే తప్ప ఇలాంటి వ్యవహారాలు జరపడం ఏమిటని భాజాపా అధిష్టానం నేతల్ని నిలదీసినట్టు సమాచారం.













