సాదినేని యామినికి కీలక పదవి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ మహిళా నేత సాదినేని యామినికి ఆ పార్టీ కీలక పదవి కట్టబెట్టింది. ఆమెను బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తున్నట్టు రాష్ట్ర విభాగం అధ్యక్షురాలు నిర్మల కిశోర్ ప్రకటించారు. ఈ మేరకు నియామక పత్రం విడుదల చేశారు. యామిని తెలుగుదేశం పార్టీలో ఉండగా ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైన తర్వాత గతేడాది జనవరిలో బీజేపీలో చేరారు. ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా వైసీపీ ప్రభుత్వంపై తన నిరసన గళాన్ని వినిపిస్తున్న సాధినేని యామిని శర్మకు బీజేపీ కీలక బాధ్యతను అప్పగించింది.
రాష్ట్రంలోని ప్రజల సమస్యల కోసం, దేవాలయాల పరిరక్షణ కోసం మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా మహిళల సమస్యల పరిష్కారం కోసం, సామాజిక సమస్యల కోసం పనిచేస్తానని, సనాతన ధర్మ పరిరక్షణకు తాను ఎల్లవేళలా పని చేస్తానని సాదినేని యామిని పేర్కొన్నారు. తనకు అవకాశం కల్పించిన అధినాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. బీజేపీలో చేరిన సంవత్సరం తర్వాత సాదినేని యామిని శర్మకు క్రియాశీలక పదవిని కట్టబెట్టడంతో ఆమె తన వాయిస్‌ను మరింత వినిపించే అవకాశం ఉందని తెలుస్తుంది.













