ప్రాచీన తెలుగు భాష విశిష్ట అధ్యయన కేంద్రాన్ని నెల్లూరులోనే కొనసాగించాలి
నెల్లూరు కేంద్రంగా ఎంతో వేగంగా పరిశోధనలు నిర్వహిస్తున్న ప్రాచీన తెలుగు భాష విశిష్ట అధ్యయన కేంద్రాన్ని మరలా మైసూరులో నెలకొల్పే భారతీయుభాషల విశ్వవిద్యాలయంలో కలపడం ఆత్మహత్య సదృశ్యమని నెల్లూరు లోని ఈ కేంద్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించి నెల్లూరులోనే కొనసాగించాలని ఆంధప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కేందప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల్లూరు కేంద్రానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అయిదు ఎకరాల రాష్ట్ర ప్రభుత్వ భూమిని కూడా కేటాయించిన సంగతిని ఆయన గుర్తు చేశారు.
మైసూరు లోని భారతీయ భాషా సంస్థను (సి.ఐ.ఐ.ఎల్) భారతీయ భాషల విశ్వవిద్యాలయంగా మార్చడానికి, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ ప్రిటేషన్ ఏర్పాటు చెయ్యడానికి భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 11 మంది సభ్యులతో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన తెలుగు భాషకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక్కరిని కూడా ఆ కమిటీలో సభ్యులుగా నియమించకపోవడం దురదృష్టకరమని ఆయన అంటూ, భారత ప్రభుత్వం ప్రాచీన భాష అభ్యున్నతి కోసం తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళ ఒడియా భాషలకు ప్రాచీన హోదా ప్రకటించి అమలు చేస్తోంది. సంస్కృతం, తమిళ భాషలకు స్వయం పతిపత్తిని ఇచ్చింది. ఢిల్లీలోని సంస్కృతం, చైన్నైలో తమిళ సంస్థలు స్వయం ప్రతిపత్తితో పనిచేస్తున్నాయి. తెలుగు, కన్నడ, ఒడియా భాషా కేంద్రాలు మాత్రం భారతీయ భాషా సంస్థలో భాగంగానే ఉన్నాయి. మైసూరులో కన్నడ కేంద్రం, నెల్లూరులో తెలుగు కేంద్రం, భువనేశ్వర్‌లో ఒడియా కేంద్రం, కేరళలోని మలయాళ విశ్వవిద్యాలయంలో మలయాళ కేంద్రం పనిచేస్తున్నాయి.
నెల్లూరులోని ప్రాచీన తెలుగు భాష విశిష్ట అధ్యయన కేంద్రాన్ని భారతీయ భాషల విశ్వవిద్యాలయంలో కలపడం వల్ల తెలుగు భాషా కేంద్రం స్వయం పతిపత్తి కోల్పోవడమే కాకుండా అభివృద్ధి కుంటుపడుతుంది. దీనికి కేటాయించవలసిన నిధులు కూడా విశ్వవిద్యాలయ పరిధిలోకి వెళ్ళి కుదించుకుపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో తెలుగు శాఖలు చాలా పనిచేస్తున్నాయి. అదే విధంగా హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలోను, అనంతపురంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలోనూ తెలుగు శాఖలు ఉన్నాయి. వీటన్నింటిలోను బోధన ప్రధానంగాను, పరిశోధన పరిమితంగానూ జరుగుతున్నాయి. ఆయా విశ్వవిద్యాలయాల్లో ఎం.ఫిల్, పి.హెచ్.డి. డిగ్రీల కోసం విద్యార్థులు చేసే పరిశోధనలకే పరిమితం అవుతున్నాయి. వాటిల్లో ప్రచురణ అంతంత మాత్రంగానే జరుగుతుంది.
ఈ నేపథ్యంలో ప్రాచీన తెలుగు భాష విశిష్ట అధ్యయన కేంద్రాన్ని భారతీయ భాషల విశ్వవిద్యాలయంలో కలపడం వలన తీవ్రమైన నష్టం కలుగుతుంది. రెండేళ్ల క్రితం ఏర్పడిన ఈ కేంద్రంలో ఏడు బాహ్య ప్రాజెక్టులు పూర్తి అయినాయి. ఇందులో ఒకటి ముద్రితమైంది. మిగిలిన ఆరు ముద్రణ చేపట్ట వలసి ఉంది. అంతర్గత ప్రాజెక్టులు ఏడు పూర్తి అయినా వాటిని కూడా త్వరలో ముద్రించవలసి ఉంది. మరో నాలుగు బాహ్య ప్రాజెక్టులు పరిశీలనలో ఉన్నాయి.
ప్రాచీన తెలుగు భాష విశిష్ట అధ్యయన కేంద్రం తన లక్ష్యాలకు అనుగుణంగా శాసనాలు చదవడం, తాళపత్రాలు పరిష్కరించడం, తెలుగు సాహిత్య అధ్యయనం గురించి కార్యశాలలను, శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. పురావస్తు సంగ్రహాలయాన్ని ఏర్పాటు చెయ్యడానికి వస్తు సామగ్రిని సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో చేయనటువంటి, కనుమరుగైపోతున్న కళాకారులను, సాహిత్య కారులను, జానపద గిరిజన కళాకారులను, జానపద కళా రూపాలను, చరిత్ర సంస్కృతులను దృశ్యీకరణ (డాక్యుంటేషన్), అంతర్జాలీకరణ (డిజిటలైజేషన్) చేయించి రాబోయే తరాల వారికి అందించటం, గ్రామీణ చేతివృత్తుల భాష, వస్తు సామగ్రిని సేకరించి భద్రపరచడానికి ప్రాచీన తెలుగు కేంద్రంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కేంద్రం లక్ష్యాలను విశ్వవిద్యాలయం ద్వారా సాధించడం ఆచరణ సాధ్యం కాదు. కాబట్టి ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని స్వయం ప్రతిపత్తి కేంద్రంగానే ఉంచాలని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కోరుతున్నారు.













