Pemmasani: రాజధాని అమరావతికి శాశ్వత భరోసా.. కేంద్రం కీలక అడుగుల పై పెమ్మసాని స్పష్టత..
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి (Amaravati) కొనసాగింపుపై చాలాకాలంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandra Sekhar) చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపాయి. భవిష్యత్తులో అమరావతిని ఎవరూ తరలించలేని విధంగా చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2024 సంవత్సరం నుంచే ఈ చట్టబద్ధతను అమల్లోకి తెస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) హామీ ఇచ్చారని తెలిపారు.
ఈ అంశంపై ఇప్పటికే అటార్నీ జనరల్ (Attorney General) తో కూడా చర్చలు జరిగాయని పెమ్మసాని వెల్లడించారు. రాజధానిగా అమరావతికి స్థిరత్వం రావాలన్న ఉద్దేశంతో అన్ని చట్టపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇదే సమయంలో రాజధానికి ప్రత్యేక పిన్ కోడ్ (Special PIN Code) మంజూరు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే ఎస్.టీ.డీ, ఐ.ఎస్.డీ కోడ్లు (STD, ISD Codes) కూడా త్వరలోనే అమలులోకి రానున్నాయని వివరించారు.
విభజన చట్టం ప్రకారం అమరావతికి కేటాయించిన అన్ని కేంద్ర సంస్థలతో చర్చలు జరిపి వాటి కార్యాలయాల ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. తాను పర్యవేక్షిస్తున్న తపాలా శాఖ (Postal Department) ప్రధాన కార్యాలయ పనులు మూడు నెలల్లో ప్రారంభమవుతాయని తెలిపారు. రాజధాని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ సముదాయాలు, హైకోర్టు (High Court), మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐఎస్ అధికారుల నివాసాలు రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ నిర్మాణాలు పూర్తయితే ప్రజలు అమరావతికి వచ్చి నివసించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో రాజధానికి అవసరమైన రోడ్లు, రవాణా సదుపాయాలు వంటి కనెక్టివిటీ పనులపై కూడా దృష్టి సారిస్తామని తెలిపారు.
ఎల్పీఎస్ లేఅవుట్ల (LPS Layouts) పనులు పూర్తయ్యాక భవన నిర్మాణాలకు అనుమతులు వస్తాయని చెప్పారు. ప్లాట్ల పరిమాణాలను తగ్గిస్తే హైదరాబాద్ (Hyderabad) లోని పాతబస్తీలా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకే ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని అభివృద్ధి చేయాలన్న ప్రయత్నాలకు ప్రజల సహకారం అవసరమని కోరారు.
ఈ సందర్భంగా అమరావతిలోని విట్ ఏపీ క్యాంపస్ (VIT-AP Campus) లో జెన్-జెడ్ పోస్టాఫీస్ (Gen Z Post Office) ను ఆయన ప్రారంభించారు. ఈ కేంద్రంలో డిజిటల్ చెల్లింపులు, ఆధునిక సదుపాయాలు, పోస్టల్, బ్యాంకింగ్, బీమా సేవలను ఒకేచోట అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ప్రైవేటు కొరియర్ సేవలకు పోటీగా తపాలా వ్యవస్థను ఆధునీకరిస్తున్నామని పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.













