తణుకు సభలో సీపీఎస్ పై పవన్ ప్రామిస్..
తణుకులో ఈరోజు చంద్రబాబు ,పవన్ సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేనాని పౌరసరఫరాల మంత్రి గురించి వ్యాఖ్యానించారు. ఆ పేరుని కూడా తన నోటితో పలకడానికి ఇష్టపడడం లేదని పవన్ పేర్కొన్నారు. టీడీఆర్ బాండ్ల సొమ్ము దోచుకొని హైదరాబాదులో స్టీల్ ఫ్యాక్టరీ స్థాపించారు అంటూ పౌరసరఫరాల మంత్రిపై ఆరోపించారు. ఈ నియోజకవర్గ నుంచి దోచుకున్న సొమ్ముని కనీసం ఇక్కడ పెట్టుబడిగా పెట్టలేదని.. స్థానికులకు ఎటువంటి ఉపాధి అవకాశం కల్పించలేదని పవన్ కళ్యాణ్ అన్నారు.
గతంలో జనసైనికులు రోడ్డుపైకి వచ్చి మరి ఇక్కడ జరిగే అన్యాయాలను ఎదిరించిన విషయాన్ని మరొకసారి పవన్ గుర్తు చేశారు. అందరూ పేదల గురించి, పారిశ్రామికవేత్తల గురించి మాట్లాడే వారే తప్ప మధ్యతరగతి వ్యక్తుల గురించి పట్టించుకునే వాళ్ళు లేరని పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకే ఈ సభ సాక్షిగా చంద్రబాబు కి మధ్యతరగతి వ్యక్తులను కూడా గమనించాల్సిందిగా విన్నవిస్తున్నట్టు పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ఏడాదిలోపే సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) పరిష్కరించాల్సిందిగా కూటమి భాగస్వాములను ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కోరారు.













