ఏపీ వ్యాప్తంగా పవన్ కల్యాణ్ పర్యటన.. ముహూర్తం ఖరారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ముహూర్తం ఖరారైంది. అక్టోబరు 5న విజయదశమి రోజున తిరుపతి నుంచి తన పర్యటన ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. దసరా రోజున ప్రారంభించి ఆరు నెలల్లో రాష్ట్రమంతా పర్యటించడం, ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు జనసేన నేతలు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటనలు ఉండేలా రూట్‌మ్యాప్ రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లోనే ఎన్నికలు ఉంటాయనే సంకేతాలు వస్తున్నందున రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు పెద్దగా సమయం లేదని, ఇప్పటి నుంచే నాయకులు సన్నద్ధం కావాలనేది పవన్ అభిప్రాయం. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే పవన్ పిలుపునిచ్చారు.













