Mahanadu: టెక్నాలజీ అద్భుతం: మహానాడు వేదికపై ఎన్టీఆర్ స్పీచ్..

కడప (Kadapa) లో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ (TDP) 44 వ మహానాడు కార్యక్రమం ఈ ఏడాది ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. మంగళవారం ప్రారంభమైన ఈ వేడుకల మొదటి రోజే పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఇది చిరస్మరణీయంగా మిగిలిపోతుందంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ప్రతీ సంవత్సరం జరిగే మహానాడులో ఏం కొత్త ఉంటుందన్నారు. కానీ బుధవారం జరిగిన ఘటనతో అందరికీ సమాధానం లభించింది.
30 సంవత్సరాల క్రితం మరణించిన తెలుగుదేశం వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు (Nandamuri Taraka Rama Rao) ఆ వేదికపై ప్రత్యక్షమవడం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన ప్రత్యక్షంగా వచ్చి, పార్టీ శ్రేణులు మరియు తెలుగు ప్రజలతో సంభాషించినట్లుగా కనిపించడం ఈరోజు మహానాడు కి హాజరైన అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది నిజంగా జరిగిన విషయం కాదు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence – AI) సాయంతో తయారైన డిజిటల్ ఎన్టీఆర్ (NTR) వేదికపై ప్రసంగించారు.
ఈ టెక్నాలజీ ప్రదర్శన వెనుక చంద్రబాబు ప్రణాళిక స్పష్టంగా కనిపించింది. ఇప్పటి వరకు యాంకర్లు, సినీ నటుల వాయిస్‌లు, రూపాలను ఏఐ సాయంతో మళ్లీ సృష్టించడం చూశాం. ఇప్పుడు అదే విధంగా, ఎన్టీఆర్ రూపాన్ని స్క్రీన్‌పై ప్రతిష్టించి, ఆయన ప్రసంగించేలా చేసిన తీరు ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేసింది. దాదాపు ఐదు నిమిషాల నిడివితో ప్రసంగించిన ఎన్టీఆర్, పార్టీ భవిష్యత్తు తెలుగు ప్రజల అభివృద్ధిని ప్రస్తావిస్తూ భావోద్వేగంతో మాట్లాడారు.
ఇప్పుడు టెక్నాలజీ రంగంలో తెలుగు యువత విజయపథంలో నడుస్తున్నారని గర్వంగా చెప్పారు. నెలకు లక్షల జీతాలు సంపాదించడం, అంతర్జాతీయ స్థాయిలో తమ కీర్తిని ప్రదర్శించడం వంటి విషయాల్లో చంద్రబాబు తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమయ్యిందన్నారు. అంతేగాక తన మనవడు నారా లోకేశ్ (Nara Lokesh) పనితీరుపై ప్రత్యేకంగా ప్రశంసలు గుప్పించారు. మనవడా భళా అంటూ చెప్పడం ఆహ్లాదకరంగా కనిపించింది.
ఎన్టీఆర్ మాట్లాడుతున్న సమయంలో అందరూ ఆయన ప్రసంగం లో లీనమైపోయా. స్పీచ్ ముగిసిన తర్వాత, ఆ మాయలోంచి బయటపడినట్లుగా నేతల హావభావాలు మారాయి. లోకేశ్ ముఖంలో కనిపించిన భావోద్వేగం చూస్తే ఆ క్షణం ఎంత గొప్పదో అర్థమవుతోంది. టెక్నాలజీతో సజీవంగా కనిపించిన ఎన్టీఆర్ మాటలు నేరుగా హృదయాల్ని తాకాయి. ఈ ప్రత్యేకత కారణంగానే ఎన్టీఆర్ అభిమానులకు ఈసారి కడప మహానాడు మరపురాని జ్ఞాపకాలలో నిలిచిపోయింది.