Minister Nimmala: ఏడాది కాలంలోనే సూపర్ సిక్స్ హామీలు అమలు : మంత్రి నిమ్మల

జీఎస్టీ తగ్గింపుతో ఒక్కో కుటుంబానికి రూ.25 వేల నుంచి 40 వేల వరకు లబ్ధి చేకూరుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన మంత్రి అచ్చెన్నాయుడి (Atchannayudi) తో కలిసి పాల్గొన్నారు. రైతులతో మంత్రులు బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ జీఎస్టీ (GST) తగ్గింపుతో రైతులు పెద్దఎత్తున లబ్ధి పొందుతున్నారని చెప్పారు. వ్యవసాయ యంత్రాలు తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఏడాది కాలంలోనే సూపర్ సిక్స్ (Super Six) హామీలు అమలు చేశాం. రైతులకు అన్నదాత సుఖీభవ కింద మొదటి విడతగా రూ.7 వేలు జమ చేశాం. గత ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన రూ.1,640 కోట్ల ధాన్యం బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించింది. అన్నదాతలకు ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే నగదు చెల్లించాం. 80 శాతం రాయితీపై విత్తనాలను అందించాం. జగన్ (Jagan) ఐదేళ్ల పాలనలో వ్యవసాయ శాఖను పూర్తిగా మూసివేసి మోసం చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలను నిర్వీర్యం చేశారు అని విమర్శించారు.