వారి సేవలు మరో రూపంలో వినియోగించుకుంటాం : సీఎం చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు, పలువురు మంత్రులు సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు. మంత్రి వర్గం కూర్పు చేసిన విధానాన్ని చంద్రబాబు వారికి వివరించారు. మంత్రివర్గంలో చోటు దక్కని వారి సేవలను మరో రూపంలో వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తమకు కేటాయించిన శాఖలపై మంత్రులు అనిత, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్ చంద్రబాబును కలిసి సంతోషం వ్యక్తం చేశారు. తనకు హోం శాఖ కేటాయించినందుకు అనిత ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మంత్రులు సమర్థవంతంగా పనిచేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు. సీఎంను కలిసిన వారిలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు తదితరులు ఉన్నారు.













