ఏపీలో పర్యటిస్తున్న న్యూ మెక్సికో స్టేట్ వర్సిటీ ప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల పనితీరును పరిశీలించి, యాజమాన్యాలతో సమీకృత (ఇంటిగ్రేటేడ్) కోర్సులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకునేందుకు అమెరికాలోని న్యూ మెక్సికో స్టేట్ యూనివర్సిటీ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. గత నాలుగు రోజుల్లో వీరు ఉన్నత విద్యా మండలి చైర్మన్ విజయరాజు, వైస్ చైర్మన్ నరసింహారావు, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ సీఈవో సాంబశివరావు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలను సందర్శించారు. కళాశాలలు, వర్సిటీలు ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల రాష్ట్ర విద్యార్థులకు రుసుముల్లో రాయితీ లభిస్తుందని ప్రతినిధుల భారత సమన్వయకర్త కుమార్ అన్నవరపు, ప్రొఫెసర్ డేవిడ్, ఫిలిప్లు పేర్కొన్నారు.













