ఈ విషయంలో అవసరమైతే… న్యాయపోరాటం
ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా మృతుల సంఖ్యను తక్కువగా చూపిస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా కట్టడి, పర్యవేక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కరోనా రెండోదశ సునామీలా విజృంభిస్తోందని విద్యార్థులు కొవిడ్ బారీన పడకుండా పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో పడకలు, మందులు దొరకని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద కరోనా చికిత్స చేయడం లేదని ఆక్షేపించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారని తెలిపారు.
నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం మూర్ఖంగా పరీక్షలు నిర్వహిస్తామంటుందని లోకేశ్ దుయ్యబట్టారు. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయ సేకరణ చేయలేదు. ఈ విషయంపై మేం పెట్టిన వాట్సాప్ నెంబర్కు 70 వేల మంది అభిప్రాయాలు పంపారు. పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి మరోమారు ఆన్లైన్లో నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటాం. ఈ విషయంలో అవసరమైతే న్యాయపోరాటం చేస్తాం అని అన్నారు.













