నెల్లూరు జిల్లాలోకి ఎంటరైన లోకేశ్.. అన్నీ తామై వ్యవహరిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు!
తెలుగుదేశం పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి చావోరేవో అన్నట్టు పోరాడుతోంది. అన్ని పార్టీల కంటే ముందే ఎన్నికల బరిలోకి దిగింది. మేనిఫెస్టోపై ఎప్పుడూ చివరివరకూ నాన్చే చంద్రబాబు.. ఈసారి ఏడాది ముందే ప్రకటించేశారు. మరోవైపు లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. రాయలసీమలో యాత్ర పూర్తి చేసుకుని నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించారు. వాస్తవానికి ఇక్కడ టీడీపీ శ్రేణుల కంటే వైసీపీ ఎమ్మెల్యేలే లోకేశ్ పాదయాత్రపై ఎక్కువ హడావుడి చేస్తున్నారు. ఇది టీడీపీకి కొత్త ఉత్సాహన్నిస్తోంది. మరోవైపు వైసీపీకి పెద్ద సమస్యగా మారింది.
నెల్లూరు జిల్లా వైసీపీకి పెద్ద సమస్యగా మారింది. గత ఎన్నికల్లో పూర్తి హవా సాధించిన వైసీపీ ఇప్పుడు డీలా పడింది. ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మాట కాదని బయటకు రావడం వైసీపీకి పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీకి దూరమయ్యారు. పార్టీ వీళ్లకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వకపోవడం, వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వనని చెప్పడం లాంటి అనేక కారణాలు వీళ్లు వైసీపీకి దూరమవ్వడానికి కారణాలు. వీళ్ల స్థానంలో వైసీపీ తరపున ఎవరిని బరిలోకి దింపాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్లు ముగ్గురూ తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. దీంతో అప్పటినుంచే వీళ్లు టీడీపీలోకి వెళ్లడం ఖాయమని అందరూ భావించారు. అయితే వీళ్లు ఇన్నాళ్లూ టీడీపీలో చేరలేదు. ఏ పార్టీలో చేరేది కూడా ప్రకటించలేదు. ఇప్పటికీ వైసీపీ సభ్యులుగా ఉండడంతో ఇప్పటికిప్పుడు పార్టీ మారడం ఎందుకనుకున్నారో ఏమో కామ్ గా తమ పని తాము చేసుకుపోతున్నారు. అధికార వైసీపీని టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్లు ముగ్గురూ మళ్లీ యాక్టివ్ అయ్యారు. లోకేశ్ యాత్ర ఇందుకు కారణమవుతోంది.
లోకేశ్ పాదయాత్ర ఇప్పుడు నెల్లూరు జిల్లాలోకి ఎంటరైంది. అయితే యాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించకముందే ఆనం రామనారాయణ రెడ్డి హైదరాబాద్ లో చంద్రబాబును కలిశారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నేరుగా బద్వేలు సమీపంలో లోకేశ్ ను కలిసి సంఘీభావం ప్రకటించారు. మరోవైపు నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కలిసి కలసి పనిచేద్దామని కోరారు. దీంతో వీళ్లంతా లోకేశ్ పాదయాత్రను సక్సెస్ చేసేందుకు నడుం బిగించారు. చంద్రబాబు టికెట్ ఇస్తే టీడీపీ తరపున పోటీ చేస్తామని ముగ్గురూ ప్రకటించారు. దీంతో టీడీపీలో చేరడం ఖాయమైంది. అయితే లోకేశ్ పాదయాత్రను విజయవంతం చేయడంపైనే ఇప్పుడు వీళ్లంతా దృష్టి పెట్టారు. ఇది జిల్లా వైసీపీ నేతలకు ఏమాత్రం రుచించడం లేదు.













