Nara Lokesh: యూనివర్సిటీలకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యం: నారా లోకేశ్
జగన్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలను విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లుగా నియమించడం వల్ల రాష్ట్ర ఉన్నత విద్యా ప్రమాణాలు దిగజారాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) మండిపడ్డారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చి, విద్యారంగాన్ని ఎంతగానో అభివృద్ధి చేసిందని ఆయన చెప్పారు. విద్యారంగంలో సంస్కరణలపై శాసన మండలిలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. “విద్యాశాఖ భారం కాదు, నా బాధ్యత” అని ఆయన (Nara Lokesh) స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఏ శాఖ కావాలని అడిగినప్పుడు, కఠినమైన శాఖను కోరుకున్నానని, అందుకే స్వయంగా అడిగిమరీ విద్యాశాఖను తీసుకున్నానని చెప్పారు.
“అసమానతలు తొలగించాలంటే, అది విద్యతోనే సాధ్యం” అని లోకేశ్ (Nara Lokesh) నొక్కి చెప్పారు. 2014 నుంచి 2019 వరకు జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (NIRF)లో రాష్ట్రంలోని 9 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు 200లోపు ర్యాంకుల్లో ఉండేవని, ప్రస్తుతం ఆ సంఖ్య 5కు తగ్గిందని లోకేశ్ (Nara Lokesh) ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) 2019లో 29వ ర్యాంకులో ఉండగా, ప్రస్తుతం 41వ స్థానానికి దిగజారిందని, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) 72వ ర్యాంకు నుంచి 100-150 మధ్యకు చేరిందని ఆయన (Nara Lokesh) తెలియజేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU) గతంలో ర్యాంకింగ్‌లో లేదని, అయితే ఈ వర్సిటీ 2024లో 97వ స్థానానికి చేరిందని తెలిపారు.
జేఎన్టీయూ అనంతపూర్, కాకినాడ, ఎస్కేయూ, పద్మావతి మహిళా యూనివర్సిటీలు ర్యాంకింగ్‌లో లేవని లోకేశ్ (Nara Lokesh) విచారం వ్యక్తం చేశారు. ఇదే సందర్భంగా.. వైసీపీ ప్రభుత్వం వైస్ ఛాన్సలర్ల నియామకాల్లో పారదర్శకత లేకుండా వ్యవహరించిందని లోకేశ్ ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం ఐఐటీ ఖరగ్‌పూర్, ఎన్ఐటీ వరంగల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో పనిచేసిన అనుభవజ్ఞులను వైస్ ఛాన్సలర్లుగా నియమించిందని ఆయన (Nara Lokesh) గుర్తు చేశారు. పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీకి తమ వైస్ ఛాన్సలర్‌ను తీసుకువెళ్లారని, తాము నియమించిన వైస్ ఛాన్సలర్లు తమ బంధువులో. స్నేహితులో కాదని లోకేశ్ స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాలకు పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన (Nara Lokesh) పేర్కొన్నారు.
ఐఐఐటీలకు గవర్నర్ ఛాన్సలర్‌గా ఉంటారని, గత ప్రభుత్వం ముఖ్యమంత్రిని ఛాన్సలర్‌గా నియమించే ప్రయత్నం చేసిందని, దానిని తాము రద్దు చేసి తిరిగి గవర్నర్‌కే ఆ బాధ్యత అప్పగించామని లోకేశ్ తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యా స్థాయిని మరింత మెరుగుపరచడానికి, విశ్వవిద్యాలయాలకు స్వయంప్రతిపత్తి, పారదర్శకతను అందించడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. విద్యారంగంలో సంస్కరణలు త్వరితగతిన అమలు చేయడం ద్వారా రాష్ట్ర విద్యా రంగాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.













