Minister Sandhyarani : చంద్రబాబును విమర్శించే హక్కు ఎవరికీ లేదు: మంత్రి సంధ్యారాణి

మహిళలకు ఉచిత బస్సు (Free bus) ప్రయాణంపై వైసీపీ విమర్శలు చేయడం అర్థరహితమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సంధ్యారాణి (Sandhyarani) అన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అసహనంతోనే వైసీపీ నేతలు మాట్లాడుతున్నట్లు ప్రజలంతా గమనించారన్నారు. ఆస్తి కోసం తల్లి, చెల్లిపై కోర్టు (Court )కు వెళ్లిన జగన్ (Jagan) తీరును రాష్ట్ర ప్రజలంతా చూశారని విమర్శించారు. తల్లి, చెల్లిపై కోర్టుకెళ్లిన వ్యక్తి కూడా మనపై మాట్లాడతారా? సీఎంగా పనిచేసిన వ్యక్తి జాతీయ జెండా కూడా ఎగురవేయలేని స్థితిలో ఉన్నారా? భరతమాత అంటే జగన్‌కు గౌరవం లేదు. జిల్లాకే పరిమితం చేద్దామనుకున్న స్త్రీ శక్తిని రాష్ట్రమంతటా అమలు చేస్తున్నందుకు జగన్‌కు కడుపు మంటగా ఉంది. స్త్రీశక్తి, తల్లికి వందనం పథకాల ద్వారా మహిళలంతా పండుగ చేసుకుంటుంటే జగన్ మాత్రం కడుపు మంటతో రగిలిపోతున్నారు. బాలికల నుంచి వృద్ధుల వరకు ఏ మహిళకు స్త్రీ శక్తి అందడం లేదో జగన్ సమాధానం చెప్పాలి. ప్రజల మీద అక్కసు ఇలానే కొనసాగితే ఉన్న 11 కూడా ఈసారి మిగలవు. మాజీ మంత్రి రోజా (Roja) నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. మహిళల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న చంద్రబాబును విమర్శించే హక్కు ఎవరికీ లేదు అని అన్నారు.