ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు.. త్వరలోనే : మంత్రి మండిపల్లి
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ, రవాణా శాఖలపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్ల జగన్ పాలనలో ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైందని మండిపడ్డారు. కారుణ్య నియామకాలపై చర్చించామన్న ఆయన, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎంతో చర్చిస్తామన్నారు. రాష్ట్రంలో రేషన్, మైన్స్ అక్రమ రవాణాను నివారిస్తామన్నారు. ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులను తొలగించి కొత్తవి తీసుకొస్తామని తెలిపారు. ఆర్టీసీలో 7 వేల మంది సిబ్బంది కొరత ఉందని, వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆర్టీసీ, రవాణా శాఖలపై ఈ నెల 12న మరోసారి సీఎం సమీక్షిస్తారన్న ఆయన, మహిళలకు ఉచిత ప్రయాణం అమలుపై సీఎం చర్చిస్తారని తెలిపారు.













