హ్యుందాయ్ మోబిస్ ఉన్నతస్థాయి బృందంతో మంత్రి నారా లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్ లో ఈవీ సెమీ కండక్టర్స్ హబ్ ఏర్పాటు చేయండి
విశాఖలో హ్యుందాయ్ మోబిస్ ఆర్&డీ/ఇంజనీరింగ్ విభాగానికి ప్రతిపాదన
సియోల్ (సౌత్ కొరియా): దక్షిణ కొరియాకు చెందిన ఆటోమోటివ్ మాడ్యూల్స్, కాంపొనెంట్స్, ఎలక్ట్రిఫికేషన్ పరికరాల తయారీ సంస్థ హ్యుందాయ్ మోబిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ బిన్ కిమ్ (Mr. Youngbin KIM), వైస్ ప్రెసిడెంట్ హన్సోక్ పార్క్ (Mr. Hanseok PARK), జంగ్‌హో సియో (Mr. Jungho SEO) లతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఏఐ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లో ఈవీ సెమీ కండక్టర్స్ హబ్ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తిరుపతి/అనంతపురం సమీపంలో ఈవీ కాంపోనెంట్స్ & బ్యాటరీ సిస్టమ్స్ తయారీ కేంద్రం, విశాఖపట్నంలో హ్యుందాయ్ మోబిస్ ఆర్&డీ/ఇంజనీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ఐఐటీ తిరుపతి భాగస్వామ్యంతో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రతిపాదించారు. ఆటానమస్ డ్రైవింగ్/ ADAS/ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిష్కారాలు, పరిశోధనలపై ఆర్టీఐహెచ్కు మార్గదర్శకత్వం వహించాల్సిందిగా సూచించారు. అనంతపురాన్ని ఆటోమొబైల్ హబ్‌గా మార్చడానికి, టైర్-1 సరఫరాదారుల సమావేశాన్ని నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్‌తో భాగస్వామ్యం వహించాలని కోరారు. భారతదేశంలో హ్యుందాయ్ మోబిస్ విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతునిస్తుందని చెప్పారు.
హ్యుందాయ్ మోబిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ బిన్ కిమ్ మాట్లాడుతూ… భారత్ లోని చెన్నై, అనంతపురంలో మాడ్యూల్స్, కీలక విడిభాగాలను తమ సంస్థ తయారు చేస్తుందని తెలిపారు. గురుగ్రామ్ ఆఫ్టర్‌మార్కెట్ విడిభాగాల కేంద్రంగా ఉంది, చెన్నై లాజిస్టిక్స్ కేంద్రం నుంచి హ్యుందాయ్/కియా సర్వీస్ విడిభాగాలను ఎగుమతి చేస్తుందని చెప్పారు. కొత్తగా హైదరాబాద్ లో ఆర్ & డీ కేంద్రం, బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఆర్ & డీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అనంతపురంలోని తయారీ కేంద్రం ద్వారా హ్యుందాయ్ సంస్థ కియా ఇండియా కోసం మాడ్యూల్స్, కీలక విడిభాగాలను ఉత్పత్తి చేస్తుందని, ఎయిర్‌బ్యాగ్‌లు, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ల వంటి కీలక భాగాలను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.








