సామాన్య భక్తురాలికి.. శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం
తమిళనాడుకు చెందిన 116 ఏళ్ల బామ్మ నవనీతమ్మ (Navaneethamma)కు తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం లభించింది. టీటీడీ అధికారులు బామ్మతో పాటుగా కుటుంబ సభ్యులకు దర్శన ఏర్పాట్లు చేసి దగ్గరుండి దర్శనం చేయించారు. వెంకన్న సేవలో పాల్గొన్న అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర (Muddada Ravichandra) నవనీతమ్మకు పట్టువస్త్రం కప్పి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన బామ్మ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. నవనీతమ్మకు, ఆమె కుటుంబ సభ్యులకు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) తెలిపారు. అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర వేదపండితులతో వేదాశీర్వచనం చేయించి, పట్టువస్త్రం కప్పి, తీర్థప్రసాదాలు అందజేశారన్నారు.
ఇటీవల నవనీతమ్మ కాలినడకన తిరుమలకు వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సీఎం చంద్రబాబు (CM Chandrababu) కూడా తన ఎక్స్ ఖాతాలో ఆ వీడియోను పోస్ట్ చేసి కొనియాడారు. ఆ వృద్ధురాలి వివరాలు తెలియజేయాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా కోరారు. ఎట్టకేలకు విజిలెన్స్ అధికారులు ఆమె చెన్నైకి చెందిన నవనీతమ్మగా గుర్తించారు.








