హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ముగ్గురు ప్రమాణం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముగ్గురు కొత్త అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన సునీత గంధం (Sunitha Gandham), ఆలపాటి గిరిధర్ (Alapati Giridhar), పురుషోత్తమ్ కుమార్ చింతలపూడి (Purushotham Kumar Chintalapudi)తో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ (Justice Lisa Gill) ప్రమాణ స్వీకారం చేయించారు. వీరు రెండేళ్ల పాటు అదనపు న్యాయమూర్తులుగా కొనసాగుతారు. ఆ తరువాత శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులవుతారు. ప్రస్తుతం హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29గా ఉంది. వీరి నియామకంతో ఈ సంఖ్య 32కు చేరనుంది.
ఈ కార్యక్రమం హైకోర్టు ప్రాంగణంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో న్యాయవ్యవస్థకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ముగ్గురు అదనపు న్యాయమూర్తులకు సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులు అభినందనలు తెలిపారు.








