Anita : స్క్రిప్ట్ ఎవరిచ్చినా అనుభవించేది పోసానే : అనిత
తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత (Anita) హెచ్చరించారు. అనంతపురంలో జరిగిన ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్‌కు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరేడ్ ముగిసిన అనంతరం అనిత మీడియాతో మాట్లాడారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని పేర్కొన్నారు. వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) గతంలో అత్యంత దారుణంగా మాట్లాడినందుకే కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో పోసాని మాటలను సమర్థించే వాళ్లు ఒక్కరైనా ఉన్నారా? అంతర్యుద్ధం గురించి మాట్లాడే గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) , తమ పార్టీలో జరుగుతున్న అంతర్యుద్ధం గురించి ముందు ఆలోచించాలి. ఇప్పటికైనా నోటిని అదుపులో పెట్టుకోవాలని గోరంట్ల మాధవన్‌ను హెచ్చరిస్తున్నా. నోటికొచ్చినట్లు మాట్లాడతాం అంటే కుదరదు. ఇక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం. ఏది పడితే అది మాట్లాడటం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. రెడ్ బుక్ ప్రకారం మేం ముందుకెళ్తే వైసీపీ నేతలెవరూ రోడ్లపై తిరగలేరు. పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయి. కక్షపూరిత రాజకీయాలు చేయడం లేదు. అలా అని తప్పు చేసిన వాళ్లని ఉపేక్షించేది లేదు. చేసిన తప్పులకు శిక్ష నుంచి వెరూ తప్పించుకోలేరు. పోసానికి స్క్రిప్ట్ (Script) ఎవరిచ్చినా అనుభవించేది ఆయనే అని అన్నారు.













