TDP: టీడీపీలో వలస కుటుంబాల సమస్య
ఆంధ్రప్రదేశ్ అధికార టిడిపి(TDP) కి వలస కుటుంబాల సమస్యలు ఎక్కువైపోయాయి. నియోజకవర్గాల్లో పార్టీ మారుతున్న వలస కుటుంబాలు.. ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. పెద్ద ఎత్తున నియోజకవర్గాల్లో ఈ మధ్యకాలంలో కొన్ని కుటుంబాలు పార్టీలు మారుతున్నాయి. వైసీపీ(YSRCP)లో అసంతృప్తిగా ఉన్న నాయకత్వం తెలుగుదేశం లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తోంది. మరి కొంత మంది జనసేనలోకి వెళుతున్నారు.
టిడిపిలో అవకాశాలు లేని వాళ్ళందరూ జనసేన వైపు చూస్తున్నారు. ఇక పార్టీలో చేరిన తర్వాత మాజీ వైసీపీ నేతలు పెత్తనం టిడిపి కార్యాలయాల్లో కూడా ఎక్కువగా ఉందనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. టిడిపి కార్యకర్తలు కూడా వాళ్ళ మాట వినాల్సిన పరిస్థితి వస్తుందని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మండల స్థాయి నాయకత్వం కూడా వైసీపీ నుంచి టిడిపిలోకి వచ్చింది. దీనితో కొంతమంది కార్యకర్తలు తమకు ఏదైనా పని కావాలంటే మాజీ వైసీపీ నేతల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఉత్తరాంధ్రలో మూడు నాలుగు నియోజకవర్గాల్లో ఇటువంటి పరిస్థితులు కనిపించాయి. కృష్ణా జిల్లాలోని మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. అటు ఒంగోలులో కూడా ఇటువంటి పరిస్థితులు ఉండటంతో కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు తమను వేధించిన వైసీపీ నేతలు ఇప్పుడు కీలక స్థానాల్లో ఉండటం, ఏకంగా ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది అనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై పార్టీ అధిష్టానం దృష్టి సారించాలని, పార్టీ క్షేత్రస్థాయి నాయకత్వం కోరుకుంటుంది.
ఇక జనసేన పార్టీలోకి వెళ్లే నాయకత్వంపై కూడా పార్టీ అధిష్టానం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. టిడిపి కార్యాలయాల్లో కూడా పార్టీ మారిన నాయకుల పెత్తనం ఎక్కువగా కనబడటంతో.. కొంతమంది టిడిపి మండల స్థాయి నాయకులు అసహనంగా ఉన్నారు. కృష్ణాజిల్లా నూజివీడులో కూడా ఇటువంటి పరిస్థితులే ఉన్నాయని, అందుకే ఇటీవల నూజివీడులో కొంతమంది తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసేసారని వార్తలు వచ్చాయి.













