Kodali Nani : కొడాలి నానిపై లుక్ అవుట్ నోటీసులు

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సీనియర్ నాయకుడు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు అలియాస్ నాని (Kodali Nani) కృష్ణా జిల్లా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు (Look out notice) జారీ చేశారు. ఇదిప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులు విచారణ దశలో ఉన్న నేపథ్యంలో, ఆయన వైద్య చికిత్స పేరుతో అమెరికాకు వెళ్లిపోయే అవకాశం ఉందన్న ఆరోపణలతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు (Kanaparthi Srinivasa Rao) ఈ నెల 18న డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు ఈ నెల 22న ఆన్‌లైన్ ద్వారా లుక్ అవుట్ నోటీసులను జారీ చేశారు.
గుడివాడ (Gudiwada) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2024 వరకు గుడివాడలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన, 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఓటమి తర్వాత కొడాలి నానిపై పలు ఆరోపణలు, కేసులు దాఖలయ్యాయి. వాలంటీర్లతో బలవంతపు రాజీనామాలు, చంద్రబాబు నాయుడుపై అసభ్యకర వ్యాఖ్యలు వంటి ఆరోపణలు ప్రధానమైనవి. విశాఖపట్నం మూడో టౌన్ పోలీస్ స్టేషన్‌లో లా విద్యార్థిని అంజనాప్రియ ఫిర్యాదు మేరకు నానిపై కేసు నమోదైంది. ఇందులో చంద్రబాబు, లోకేశ్‌లపై సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇంతలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. హైదరాబాద్ లో కొంతకాలం చికిత్స తీసుకున్న అనంతరం మెరుగైన వైద్యంమ కోసం ముంబై వెళ్లారు. అక్కడ గుండె శస్త్రచికిత్స చేయించుకున్నట్లు సమాచారం. అయితే, ఆయన అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లో పాస్‌పోర్ట్ లేనప్పటికీ, తెలంగాణ చిరునామాతో పాస్‌పోర్ట్ తీసుకునే అవకాశం ఉందని టీడీపీ నాయకుడు కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఆదేశాలతో లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి.
లుక్ అవుట్ నోటీసులు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలకు పంపినట్లు సమాచారం. ఈ నోటీసుల ద్వారా కొడాలి నాని దేశం విడిచి వెళ్లకుండా నిరోధించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్ ద్వారా జారీ చేసిన ఈ నోటీసులు, నాని కదలికలపై నిఘా పెట్టడానికి, ఆయన పాస్‌పోర్ట్ ను సీజ్ చేసేందుకు దోహదపడతాయి. ఆయన విదేశాలకు పారిపోకుండా నిరోధించేందుకే ఈ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
కొడాలి నాని గతంలో చంద్రబాబు, నారా లోకేశ్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది. దీనిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆయన అనారోగ్యం కారణంగా హైదరాబాద్ కే పరిమితం కావడం, తర్వాత ముంబై వెళ్లిపోవడంతో ఆయన్ను అరెస్టు చేసేందుకు వీలు కాలేదు. ఇప్పడు ఏకంగా అమెరికా వెళ్లేందుకు కొడాలి నాని ఏర్పాట్లు చేసుకుంటున్నారనే వార్తలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.