KL University: ప్రతి కాలేజీ, యూనివర్సిటీ లో ప్రయోగాలు జరగాలి: కేంద్ర మంత్రి భూపతిరాజు

కేఎల్ విశ్వవిద్యాలయం (KL University) నుంచి మూడు శాటిలైట్లు (Three satellites) లాంచ్ కావడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ (Bhupathiraju Srinivasa Varma) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ యూనివర్సిటీ విద్యార్థుల నైపుణ్యం, సృజనాత్మకత ఎలాంటిదో శాటిలైట్లు తెలియజేస్తాయని తెలిపారు. విద్యార్థులు రెండేళ్ల క్రితమే, కేఎల్‌శాట్ 1 లాంచ్ చేశారని గుర్తు చేశారు. ఇవాళ లాంచ్ చేసిన కాన్‌శాట్, ఇస్రో (ISRO) సహకారంతో లాంచ్ అయిందని పేర్కొన్నారు. కేఎల్ యూనివర్సిటీ నుంచి లాంచ్ అవుతున్న శాటిలైట్లు వాతావరణం, ఓజోన్ పొర, హెల్త్ ఇలా వివిధ అంశాలకు సంబంధించి డేటా అందిస్తాయని తెలిపారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్, సీఎం చంద్రబాబు విజన్ ఆంధ్ర, కలిసి మంచి ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి కళాశాల ప్రయోగశాలగా మరాల్సిన అవసరం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి కాలేజీ, యూనివర్సిటీలో ప్రయోగాలు జరగాలని సూచించారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను ఉపాధ్యాయులు వెలికి తీయాలన్నారు. భారత్ టెక్నాలజీలో అనేక దేశాలతో పోటీ పడుతోందని వెల్లడించారు.