రాజకీయాల్లోకి రావడంపై జూ.ఎన్టీఆర్ రియాక్షన్ ఇదే..!?
జూనియర్ ఎన్టీఆర్.. వెండితెరపై తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో. నందమూరి తారకరామారావు వారసుడిగా ఆయన పేరే పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ కు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఆయన RRR మూవీలో రామ్ చరణ్ తో పాటు నటిస్తున్నారు. ఆయనకు రాజకీయాలు కొత్తకాదు. గతంలో తెలుగుదేశం పార్టీ తరపున అనేక సార్లు ప్రచారం చేశారు. తాజాగా మరోసారి ఆయన రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ ఊపందుకుంది.
ఈ మధ్య చంద్రబాబు చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. అక్కడ కొంతమంది టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్లీలు ఏర్పాటు చేశారు. అందులో చంద్రబాబు, బాలకృష్ణ, లోకేశ్ ఫోటోలు కూడా పెట్టారు. ఫ్లెక్సీలతో సరిపెట్టుకోకుండా.. జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి తీసుకురావాల్సిందిగా నేరుగా చంద్రబాబునే కోరారు. దీనికి చంద్రబాబు కూడా నవ్వుతూ తలూపారు. అయితే చంద్రబాబుకు, జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య గతంలో లాగా సత్సంబంధాలు లేవనే విషయం తెలిసిన విషయమే.
ఇదే విషయాన్ని తాజాగా కొంతమంది విలేకరులు జూనియర్ ఎన్టీఆర్ ను అడిగారు. త్వరలోనే ఆయన జెమినీ టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు.. పేరుతో ఓ ప్రోగ్రామ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. సామాన్యుడి కలలను నెరవేర్చేలా ఈ ప్రోగామ్ ఉంటుందన్నారు ఎన్టీఆర్. ఆట నాది.. కోటి మీది.. రండి గెలుద్దాం.. అంటూ ప్రోమోలో సందడి చేశారు ఎన్టీఆర్.
ఇదే వేదికపై రాజకీయాల ప్రస్తావన కూడా వచ్చింది. రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. సమాధానం మీరే చెప్పాలన్నారు ఎన్టీఆర్. అసలిది సందర్భం కాదు.. సమయం కాదు.. అంటూ తోసిపుచ్చారు. మరోసారి మరో వేదికపై దీనిపై తాపీగా వేడివేడిగా కాఫీ తాగుతూ చర్చించుకుందాం.. అంటూ దాటవేశారు. అయితే.. తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని కానీ.. వస్తానని కానీ చెప్పలేదు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో వేచి చూడాలి.













