వారికి భయం అంటే ఏమిటో నేర్పిస్తా : పవన్
కోడికత్తి, కిరాయి మూకలకు భయపడే ప్రశ్నేలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ వైసీపీ నేతలపై మండిపడ్డారు. వైసీపీ వ్యక్తులకు డబ్బు, అధికారం, అహకారం, మద్యం బాగా పుష్కలంగా ఉన్నాయి. వారికి లేనిదల్లా భయం. భయం అంటే ఏమిటో నేను నేర్పిస్తా అని హెచ్చరించారు. తాను పారిపోయే వ్యక్తిని కాదని, తాను మాటలు చెప్పే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. తాను ఎప్పుడు ఏం అడిగినా ఏపీ గురించే అడుగుతానని చెప్పారు. కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతానని హెచ్చరించారు. తాను ఆడబిడ్డలను చాలా గౌరవిస్తానని తెలిపారు. తన వ్యక్తిగత జీవితం బ్లాక్ అండ్ వైట్ అని పేర్కొన్నారు.
గుంటూరు బాపట్లలో పుట్టిన వాడిని తనకు బూతులు రావా? అని ప్రశ్నించారు. సాటి మనిషికి అన్యాయం జరిగితే స్పందించే గుణం తనదని అన్నారు. తాను హీరోను కాదని, నటుడు అవ్వాలని తనకు కోరిక లేదని పలు సందర్భారాల్లో చెప్పానని అన్నారు. రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి బూతులు మాట్లాడటం లేదని అన్నారు. రాజకీయాల్లో కలుపు మొక్కలను ఏరివేయాలని వచ్చానని స్పష్టం చేశారు. టీడీపీకైనా బీజేపీకైనా ఏపీ కోసమే మద్దతు ఇచ్చానన్నారు. నేను సినిమా టికెట్ల గురించి అడిగా నాకేమైనా థియేటర్లు ఉన్నాయా? వైసీపీ వారికే ఉన్నాయి. మహానుభావులకు తల వంచుతాం. మీలాంటి వారి తాటా తీస్తాం. ఏదైనా అంటే అరుస్తారు. మాట్లాడరు. ఏపీలో అభివృద్ధి లేదు. ఒక్క రోడ్డయినా వేశారా? అని ప్రశ్నించారు.













