మళ్లీ రెండు చోట్ల పోటీ చేయబోతున్న పవన్ కల్యాణ్..!?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి కచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని తపిస్తున్నారు. అంతేకాదు.. తనకు సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని.. తనను సీఎం చేయాలని కోరుతున్నారు. ఈసారి అసెంబ్లీ అడుగు పెట్టకుండా ఎవరు అడ్డుకుంటారో చూస్తానంటూ హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పటికీ పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై క్లారిటీ మాత్రం లేదు. పార్టీ అధినేతలందరికీ ఇప్పటికే సొంత నియోజకవర్గాలున్నాయి. వాటి నుంచే వాళ్లు మళ్లీ పోటీ చేయడం గ్యారెంటీ. కానీ పవన్ కల్యాణ్ కు ఆ పరిస్థితి లేదు. ఏ సీటు నుంచి పోటీ చేస్తారో ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈసారి కూడా ఆయన రెండు స్థానాల నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేశారు. భీమవరం, గాజువాక స్థానాల్లో పోటీ చేసిన ఆయన.. రెండు చోట్లా ఓడిపోయారు. దీంతో ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టలేకపోయారు. ఓ పార్టీ అధినేతగా ఉండి రెండు చోట్లా ఓడిపోవడం జనసైనికులను తీవ్రంగా బాధించింది. ఇటీవల కూడా పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తన జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటనల్లో అది ఒకటని చెప్పారు. అందుకే ఈసారి అలాంటి పొరపాటు చేయకూడదనుకుంటున్నారు పవన్ కల్యాణ్. కచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు తనకు అనుకూలమైన స్థానాల అన్వేషణలో పడ్డారు.
పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ ఈసారి పోటీ చేయడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. కాపు సామాజిక వర్గ ఓట్లు అత్యధికంగా ఉండడం, తన అభిమానులు ఎక్కువగా ఉండడంతో పవన్ ఈ స్థానంపై మక్కువ చూపుతున్నారు. వారాహి యాత్ర కూడా ఇక్కడ సూపర్ సక్సెస్ అయింది. ఇక్కడ త్వరలోనే పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తానని, ఇక్కడి వాళ్లకు తాను నిత్యం అందుబాటులో ఉంటానని ప్రకటించారు. దీంతో ఆయన పిఠాపురం నుంచి పోటీ చేయడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అయితే పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తే ఆయనపై పోటీ చేసేందుకు తాను సిద్ధమని ముద్రగడ ప్రకటించారు. దీంతో ఈ స్థానం ఆసక్తికరంగా మారింది.
పిఠాపురంతో పాటు మరో స్థానంలో కూడా పోటీ చేసేందుకు పవన్ కల్యాణ్ ఆసక్తి చూపిస్తున్నారు. తమకు సేఫ్ ప్లేస్ గా తిరుపతిని భావిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి ఇక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు. ఇప్పటికీ మెగాస్టార్ ఫ్యామిలీపై స్థానికంగా అభిమానం ఉంది. అందుకే తిరుపతి నుంచి కూడా పోటీ చేయాలనుకుంటున్నారు పవన్ కల్యాణ్. గతంలో భీమవరంలో తప్పక గెలుస్తామనుకున్నారు. కానీ అక్కడ కాపులే తనకు అండగా నిలబడలేదని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఇప్పుడు పిఠాపురంలో కూడా అలాంటి పరిస్థితి నెలకొంటే చాలా కష్టం. అందుకే తిరుపతి అయితే తాను పక్కాగా అసెంబ్లీలో అడుగు పెట్టొచ్చనే ధీమాలో ఉన్నారు పవన్ కల్యాణ్. టీడీపీతో పొత్తు కుదిరితే ఈ రండు స్థానాలు కచ్చితంగా జనసేనకు కేటాయించేలా ఒత్తిడి చేయనున్నారు.













