గత ప్రభుత్వాలు చేయని విధంగా మత్స్యకారులకు ఆర్థిక లబ్ధి: జగన్
గత ప్రభుత్వాలు చేయని విధంగా మత్స్యకారులకు ఆర్థిక లబ్ధి చేకూరుస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం కింద ఐదో ఏడాది నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో నిధులను విడుదల చేసిన అనంతరం ఓడరేపు ఫిషింగ్ హార్బర్, ఆక్వా పార్కుకు సీఎం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆర్థికసాయం అందజేస్తున్నామని తెలిపారు. ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.10 వేల చొప్పున సాయం అందించి వారిని ఆదుకుంటున్నామన్నారు. ఈ ఏడాది రూ.123 కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఈ ఒక్క పథకం కిందే రూ.538 కోట్లు అందజేశామని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు. తాను చేసిన మంచిని, ప్రజల్ని, దేవుడిని నమ్ముకుంటే, వారిద్దరూ మాత్రం పొత్తులను నమ్ముకున్నారని విమర్శించారు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం సినిమాల మధ్య విరామం దొరికినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై బురదచల్లడమే పవన్ పని అని ఆరోపించారు. పేదవాడికి మంచి జరుగుతుంటే వారు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.













