పిడుగురాళ్లలో ప్రత్యర్థులపై ఫైర్ అయిన జగన్..
పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో ఈరోజు సాయంత్రం జగన్ మేమంతా సిద్ధం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ యువత, వారి భవిత గురించి ప్రసంగించారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 2.31 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశానని జగన్ వెల్లడించారు. తనను అంతగా విమర్శించే చంద్రబాబు తన హయాంలో కేవలం 32 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. మీ బిడ్డ భర్తీ చేసిన ఉద్యోగాలు ఎక్కడ.. ఆ చంద్రబాబు ఇచ్చిన ఉద్యోగాలు ఎక్కడ? అంటూ జగన్ చంద్రబాబును వ్యాఖ్యానించారు. అంతేకాదు జాబు రావాలి అంటే అధికారంలోకి ఎవరు రావాలి అని ప్రజలను ప్రశ్నించారు. 14 సంవత్సరాల చంద్రబాబు పాలనలో.. యువతకు ఉద్యోగ అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్నాయని జగన్ చెప్పారు. తాను అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నర సంవత్సరంలో కేవలం వైద్యరంగంలోనే 54 వేల ఉద్యోగ నియామకాలు జరిగినట్లు వెల్లడించారు. గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి 1.35 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పించానని ఆయన పేర్కొన్నారు. బాబు వస్తే ఉన్న జాబులు పోతాయని.. జాబు కావాలి అంటే ఫ్యాన్ రావాలి అని జగన్ అన్నారు. ఇవి తనకు చంద్రబాబుకి మధ్య జరిగే ఎన్నికలు కావని చెప్పిన జగన్.. చంద్రబాబు మోసాలకి ప్రజలకి మధ్య జరిగే ఎన్నికలని స్పష్టం చేశారు. కాబట్టి ఎవరిని ఎంచుకోవాలి అన్న విషయాన్ని ప్రజలకే వదిలేస్తున్నానని చెప్పారు. ఇప్పటికీ.. ఎప్పటికీ తమ పార్టీ పేదల పార్టీ అని.. పేదలకి మద్దతు ఇస్తామని.. వారి ఆశీర్వాదమే తమకు బలమని జగన్ పేర్కొన్నారు.













