Amaravathi: అమరావతిలో భూములపై భారీ ఆసక్తి.. వెంచర్లకు పెరుగుతున్న డిమాండ్

అమరావతి (Amaravati) మళ్లీ రియల్ ఎస్టేట్ రంగంలో చైతన్యం చూపిస్తోంది. గతంలో కొన్ని సంవత్సరాలుగా నిశ్శబ్దంగా ఉన్న మార్కెట్ ఇప్పుడు ఒకసారిగా తిరిగి ప్రాముఖ్యత సంతరించుకుంటోంది . ప్రత్యేకంగా ఆదివారం రోజు, వేరువేరు జిల్లాల నుంచి వచ్చిన ప్రజల కదలికలు అక్కడ కనిపించాయి. అభివృద్ధి పనులు, ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల పరిశీలన కోసం చాలా మంది అమరావతిని సందర్శించారు.
ఈ సందర్శకుల్లో హైదరాబాద్ (Hyderabad), వరంగల్ (Warangal), ఖమ్మం (Khammam) వంటి ప్రాంతాల ప్రజలతో పాటు గోదావరి జిల్లాలకు చెందిన వ్యాపారులు, మధ్య తరగతి వర్గాలు కూడా ఉన్నారు. భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టాలనే దృష్టితో వారు అక్కడి వెంచర్లు పరిశీలించారని చెబుతున్నారు. కొంతమంది నేరుగా భూముల కొనుగోలుకే వచ్చినట్టు సమాచారం. ఇది చాలా కాలం తర్వాత అమరావతిలో కనిపించిన రియల్ ఎస్టేట్ కదలిక.
ఈ క్రియాశీలత వెనుక ప్రధాన కారణం రాజధానిలో నిర్మాణాలు మళ్లీ ప్రారంభం కావడమే. అంతేకాక, ఒక అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి వార్తలు ప్రచారంలో ఉండటం, భవిష్యత్తులో గుంటూరు (Guntur), తెనాలి (Tenali), మంగళగిరి (Mangalagiri), విజయవాడ (Vijayawada) పట్టణాలను కలిపి ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయవచ్చన్న చర్చలతో రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై నమ్మకాన్ని పెంచాయి.
అంతే కాదు ప్రభుత్వం కృష్ణా నదిపై రెండు ప్రత్యేక బ్రిడ్జిల నిర్మాణాన్ని కూడా యోచిస్తున్నట్టు సమాచారం. ఇలాంటి వసతులు పెరగడం వల్ల భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రాధాన్యత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.మొత్తంగా చూస్తే, రాబోయే నెలల్లో అమరావతి ప్రాంతం మళ్లీ రియల్ ఎస్టేట్ దృష్టిలో కీలకంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గజం ధరలు, స్క్వేర్ ఫీటు రేట్లు తదితర విషయాలపై ఆసక్తి పెరుగుతోంది. ఎన్నికల ఫలితాలు, అభివృద్ధి పథకాలు ఈ మార్పును మరింత బలంగా నడిపించే అవకాశముంది. అయితే మరోపక్క కూటమి ప్రభుత్వం ఐదేళ్ల పాలన పూర్తయ్యేలోపు అమరావతి పూర్తిగా ఈ పెట్టుబడులకు న్యాయం జరుగుతుంది. లేనిపక్షంలో తిరిగి పాతకతే మళ్లీ పునరావృతం అవుతుంది.. అని వాదించే వారు కూడా ఉన్నారు.