ప్రభుత్వంతో చర్చలు ఉండవు.. 21న సమ్మె నోటీసు ఇస్తాం
పీఆర్సీపై ప్రభుత్వం ఇచ్చిన జీవోలను బేషరతుగా రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. విజయవాలోని ఎన్జీవో కార్యాలయం వద్ద పీఆర్సీ జీవోలను దహం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ కొత్త పీఆర్సీ ప్రకారం ప్రతి ఒక్క ఉద్యోగికి రూ.6 వేల నుంచి 7 వేల వరకు జేబుకు చిల్లు పడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పీఆర్సీ వద్దు, డీఏలతో కూడిన 27 శాతం ఐఆర్ ఇస్తున్న పాత జీతమే ముద్దు అని కార్యవర్గ సమావేశంలో తీర్మానించినట్టు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం తమను మోసం చేసిందని, ఉద్యోగులు తమ భవిష్యత్తును తాకట్టు పెట్టేందుకు సిద్ధంగా లేరన్నారు. పీఆర్సీ పై సమ్మెకు దిగాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయని, 21న సీఎస్‌కు సమ్మె నోటీసు ఇస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగుల ఆశలను వమ్ము చేయమని స్పష్టం చేశారు. ఇకపై ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు ఉండవని అన్నారు.













