ఉచిత విద్యుత్-నగదు బదిలీపై సందేహాలెన్నో..
ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ పేరుతో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాలు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు దర్శకత్వంలో ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ పథకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోందని అవి ఆరోపిస్తుంటే రైతుకు ఏమాత్రం అన్యాయం జరగదని ఇంకా మరింత మేలు జరుగతుందని ప్రభుత్వం అంటోంది. ఈ పరిస్థితుల్లో రైతాంగంలో కూడా కొంత గందరగోళం నెలకొంది. నగదు బదిలీ పేరుతో కొన్ని యూనిట్లకే ఉచిత విద్యుత్‌ను పరిమితం చేస్తారేమో అనే ఆందోళన రైతుల్లో నెలకొంది. రైతులపైనా భారం మోపటంతో పాటు అంతిమంగా వ్యవసాయానికి మీటర్లు బిగించేందుకే ఈ తతంగం నడుస్తోందనే భయాలు వారిని వేధిస్తున్నాయి. దీనిని అమలులోకి తెస్తే.. రైతుల ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు కూడా మీటర్లు బిగిస్తారని, వ్యవసాయానికి వినియోగించుకున్న కరెంటులో నిర్ణీత యూనిట్ల మేరకే ప్రభుత్వం సబ్సిడీ పరిమితం చేస్తుందని పలువురు అంటున్నారు.
ప్రస్తుతం వంట గ్యాస్ సబ్సిడీకి నగదు బదిలీ అమలు చేస్తున్న తరహాలోనే ఆ సబ్సిడీని కూడా.. రైతులు ముందుగా బిల్లు మొత్తం కట్టేయాలని, ఆ తర్వాత తాము సబ్సిడీ సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని చెప్తారని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ అమలు చేస్తే ఇదే తరహాలో సబ్సిడీ కోసం రైతులు నెలల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి తలెత్తనుందనే ఆందోళన కూడా కలుగుతోంది. దీనికి విపక్షాల ఆరోపణలు ఊతమిస్తున్నాయి. విపక్షాలేమంటున్నాయంటే… ప్రపంచబ్యాంకు తయారుచేసిన ‘వ్యవసాయానికి నేరుగా నగదు బదిలీ’ ముసాయిదా నివేదికకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు లేకపోవటంతో ఫలానా రైతు కచ్చితంగా ఎంత విద్యుత్‌ను వినియోగించాడనే విషయం తెలియడం లేదు. దీంతో ఉచిత విద్యుత్ వినియోగాన్ని ఈ విధంగా లెక్కిస్తున్నారు.. 5 హార్స్ పవర్ (హెచ్‌పీ) మోటారు రోజుకు 7 గంటలు విద్యుత్‌ను వినియోగిస్తే 5.25 యూనిట్ల విద్యుత్ కాలుతోందని అంచనా వేస్తున్నారు.
ఈ లెక్కన ఏడాదిలో 300 రోజులకు గాను ఒక్కో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ 1,575 యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తుందని అంచనా కట్టారు. ఇన్ని యూనిట్లకు గాను విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చును లెక్కించి.. ఆ మొత్తం సబ్సిడీని విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం ఇస్తోంది. అయితే.. వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు లేకపోవటం వల్ల కచ్చితంగా ఇంత విద్యుత్‌ను వినియోగిస్తున్నారన్న లెక్కలు లేవు. నగదు బదిలీ పథకం పేరుతో వ్యవసాయానికి మీటర్లు బిగించడంతో పాటు కరెంటు బిల్లును మొదట రైతులు చెల్లించే విధంగా ప్రణాళిక సిద్ధమవుతోంది. అదేవిధంగా మొత్తం భారాన్ని సబ్సిడీగా భరించలేమని.. కొన్ని యూనిట్ల వరకు మాత్రమే సబ్సిడీ ఇచ్చి అంతకు మించితే మొత్తం బిల్లును రైతులే చెల్లించాల్సి ఉంటుందన్న నిబంధనను కూడా విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల తరహాలోనే ఉచిత విద్యుత్‌కూ పరిమితులు విధించే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే నగదు బదిలీ పేరుతో ఉచిత విద్యుత్ భారాన్ని రైతుపై మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నమాట.













