High Court: దేశంలో ఐదు హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లు.. నలుగురి బదిలీ!
భారత దేశంలోని ఐదు హైకోర్టులకు (High Courts) కొత్త ప్రధాన న్యాయమూర్తులను (చీఫ్ జస్టిస్లను) నియమించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా, నలుగురు సిట్టింగ్ చీఫ్ జడ్జిలను వేర్వేరు హైకోర్టులకు (High Courts) బదిలీ చేసినట్లు తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సలహా మేరకు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నియామకాలు, బదిలీలను ఆమోదించారు.
కొత్త సీజేలు ఈ కోర్టులకే..
మధ్యప్రదేశ్ హైకోర్టు: అక్కడ తాత్కాలిక సీజేగా ఉన్న జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా శాశ్వత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జార్ఖండ్ హైకోర్టు: హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా ఉన్న జస్టిస్ తార్లోక్ సింగ్ చౌహాన్‌కు జార్ఖండ్ హైకోర్టు (High Court) సీజేగా పదోన్నతి లభించింది.
కర్ణాటక హైకోర్టు: ఢిల్లీ హైకోర్టు జడ్జి విభు బాఖ్రూ కర్ణాటక హైకోర్టు సీజేగా నియమితులయ్యారు.
గువాహతి హైకోర్టు: పట్నా హైకోర్టు తాత్కాలిక సీజేగా ఉన్న జస్టిస్ ఆశుతోష్ కుమార్‌ను గువాహతి హైకోర్టు (High Court) సీజేగా నియమించారు.
పట్నా హైకోర్టు: పట్నా హైకోర్టులో జడ్జిగా ఉన్న జస్టిస్ విపుల్ మనుభాయ్ పంచోలికి అదే కోర్టులో సీజేగా పదోన్నతి లభించింది.
బదిలీ అయిన ప్రధాన న్యాయమూర్తులు..
దేశవ్యాప్తంగా నాలుగు హైకోర్టుల్లో ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్న వారిని బదిలీ చేశారు. రాజస్థాన్ హైకోర్టు (High Court) చీఫ్ జస్టిస్ మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ.. మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. త్రిపుర సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌ను తెలంగాణ హైకోర్టుకు, జార్ఖండ్ సీజే జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావును త్రిపుర హైకోర్టుకు, మద్రాస్ సీజే జస్టిస్ కేఆర్ శ్రీరామ్‌ను రాజస్థాన్ హైకోర్టుకు (High Court) బదిలీ చేశారు.













