Duvvada Vs Dharmana: దువ్వాడ vs ధర్మాన.. రోడ్డెక్కిన శ్రీకాకుళం రాజకీయం!
ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత స్తబ్దుగా మారిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఇప్పుడు నడిరోడ్డుపై పడ్డాయి. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మధ్య చెలరేగిన మాటల యుద్ధం.. ఇప్పుడు హత్యకు కుట్ర అనే తీవ్ర ఆరోపణల వరకు వెళ్లడం జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతోంది. వ్యక్తిగత దూషణలు, రాజకీయ ఆధిపత్య పోరు కలగలిసి జిల్లా వైసీపీలో నిప్పు రాజేశాయి.
శుక్రవారం అర్థరాత్రి టెక్కలి జాతీయ రహదారిపై జరిగిన సంఘటన జిల్లా రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తనను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందన్న సమాచారంతో హైదరాబాద్ నుంచి ఆగమేఘాల మీద శ్రీకాకుళం చేరుకున్న దువ్వాడ శ్రీనివాస్.. నేరుగా హైవేపైకి వచ్చి సవాల్ విసిరారు. “నా హత్యకు స్కెచ్ వేశారు.. దమ్ముంటే ఇక్కడికే వచ్చి చంపండి,” అంటూ ఆయన చేసిన సవాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వ్యవహారం కేవలం రాజకీయ విమర్శల స్థాయిని దాటి, ప్రాణహాని ఉందని ఆరోపించే స్థాయికి చేరడం గమనార్హం.
ఈ తాజా గొడవకు ప్రధాన కారణం ఒక ఫోన్ కాల్ అని తెలుస్తోంది. ధర్మాన కృష్ణదాస్‌కు అత్యంత సన్నిహితుడైన కింజరాపు అప్పన్న అనే వ్యక్తి.. దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధురికి ఫోన్ చేసి బెదిరించినట్లు సమాచారం. దువ్వాడను అంతమొందించడానికి రంగం సిద్ధమైందని, ఈ కుట్ర వెనుక ధర్మాన వర్గం ఉందని ఆ కాల్ సారాంశంగా దువ్వాడ ఆరోపిస్తున్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే తీవ్ర ఆగ్రహానికి గురైన దువ్వాడ, రాత్రికి రాత్రే రోడ్డెక్కి ధర్మాన సోదరులను టార్గెట్ చేశారు.
దువ్వాడ శ్రీనివాస్ ఆరోపణలు కేవలం కృష్ణదాస్‌కే పరిమితం కాలేదు. జిల్లాలో చక్రం తిప్పుతున్న ధర్మాన సోదరులు కృష్ణదాస్, ప్రసాదరావు.. తనను రాజకీయంగా అణగదొక్కడమే కాకుండా, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయాలని చూస్తున్నారని దువ్వాడ మండిపడ్డారు. ఇప్పటికే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయించడంలో వారి పాత్ర ఉందన్నది దువ్వాడ వాదన. “నన్ను పార్టీ నుంచి పూర్తిగా బహిష్కరిస్తేనే నాకు ఆనందం. అప్పుడు జిల్లాలో ఒక వర్గాన్ని అణచివేస్తున్న వీరిపై మరింత స్వేచ్ఛగా పోరాడగలను” అని దువ్వాడ వ్యాఖ్యానించడం.. ఆయన భవిష్యత్ కార్యాచరణనుక స్పష్టం చేస్తోంది. ధర్మాన సోదరుల ఆధిపత్యానికి గండి కొట్టాలన్నదే ఆయన ప్రధాన అజెండాగా కనిపిస్తోంది.
మరోవైపు, ఈ ఆరోపణలను మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా ఖండించారు. ఇదంతా దువ్వాడ ఆడుతున్న డ్రామాగా ఆయన అభివర్ణించారు. “దువ్వాడను చంపాల్సిన అవసరం నాకు ఏముంది? ఆయన చేస్తున్న ఆరోపణలు చూసి జనం నవ్వుకుంటున్నారు” అని కృష్ణదాస్ ఎద్దేవా చేశారు. కింజరాపు అప్పన్నతో తాను మాట్లాడింది నిజమే అయినా, దువ్వాడపై తనకు ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదని స్పష్టం చేశారు. అనవసర రాద్ధాంతం చేసి సానుభూతి పొందాలన్నది దువ్వాడ ఎత్తుగడ అని ధర్మాన వర్గం వాదిస్తోంది.
ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే, ఇది కేవలం రాజకీయ వైరం మాత్రమే కాదని అర్థమవుతోంది. గత కొంతకాలంగా దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత జీవితం, దివ్వెల మాధురితో సహజీవనం, భార్య వాణితో విభేదాలు రచ్చకెక్కాయి. ఈ క్రమంలో పార్టీ అధిష్ఠానం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే, ఈ సస్పెన్షన్ వెనుక ధర్మాన సోదరుల హస్తం ఉందని దువ్వాడ బలంగా నమ్ముతున్నారు.
ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత జిల్లాలో కేడర్‌ను నడిపించే నాయకత్వం డీలా పడింది. ఈ సమయంలో సీనియర్ల మధ్య సమన్వయం లోపించడం, ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించాలనుకోవడం ఈ రచ్చకు కారణమైంది. శ్రీకాకుళం జిల్లాలో బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరు నేతల మధ్య పోరు.. అంతిమంగా ఆ సామాజిక వర్గంలో చీలికకు దారితీసే ప్రమాదం ఉంది. పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక, తన ఉనికిని చాటుకోవడానికి దువ్వాడ దూకుడు పెంచారు. ధర్మాన వంటి సీనియర్‌ను ఢీకొట్టడం ద్వారా.. తాను ఎవరికీ భయపడననే సంకేతాన్ని కేడర్‌కు, ప్రజలకు ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
శ్రీకాకుళం వైసీపీలో ముదురుతున్న ఈ ముసలం ఎటు దారి తీస్తుందోనన్న ఆందోళన కార్యకర్తల్లో నెలకొంది. అధికారం కోల్పోయిన సమయంలో నేతలు సంయమనం పాటించాల్సింది పోయి, ఇలా రోడ్లెక్కి సవాళ్లు విసురుకోవడం పార్టీకి మరింత నష్టం చేకూరుస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అటు పోలీసులు కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. హత్య కుట్ర ఆరోపణలు నిజమా? లేక రాజకీయ స్టంటేనా? అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా, దువ్వాడ వర్సెస్ ధర్మాన ఎపిసోడ్ సిక్కోలు రాజకీయాల్లో ఇప్పట్లో చల్లారేలా లేదు.













