Chandrababu: చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్టుకు.. ప్రధాని గ్రీన్ సిగ్నల్!

ఏపీకి ఎనలేని ప్రాధాన్యమిస్తోంది కేంద్రం. ముఖ్యంగా ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీకి అధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ తరచూ ఏపీలో పర్యటిస్తూ కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ వస్తున్నారు. మరోసారి ఈనెల 16న ఏపీలో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) . అయితే కేవలం శ్రీశైలం (Srisailam) ఆలయ సందర్శనే కాకుండా ప్రధాని కర్నూలులో డ్రోన్ సిటీకి శంకుస్థాపన చేస్తారని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అందుకు సంబంధించి ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి సచివాలయంలో ఆర్టిజిఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు (Chandrababu) . అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
అమరావతిని డ్రోన్ల హబ్ గా మార్చాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కర్నూలులో డ్రోన్ల సిటీ (drone city) ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. డిసెంబర్లో ఏపీలో భారీ డ్రోన్ షో నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అన్ని రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరగాలని, ఆ దిశగా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. డ్రోన్ సిటీ అనేది చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్ట్. ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 16న కర్నూలులో పర్యటించనున్నారు. మూడు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అదే వేదికపై ప్రధాని చేతుల మీదుగా డ్రోన్ సిటీని ప్రారంభించనున్నారు.