Dokka Seethamma: డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం: లోకేశ్ కీలక నిర్ణయం
ఏపీ రాజకీయాల్లో విద్యారంగానికి సంబంధించిన అంశాలు ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటాయి. వైసీపీ (YCP ) ప్రభుత్వ హయాంలో విద్యార్థుల కోసం అనేక పథకాలను అమలు చేశామని పార్టీ నేతలు చెబుతూ ఉంటారు. అయితే, ఇంటర్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేసిన విషయాన్ని విమర్శకులు తరచూ గుర్తు చేస్తుంటారు.
2014-19 మధ్య టీడీపీ (TDP) ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజన పథకాన్ని (Midday meal scheme for Inter students) అమలు చేసింది. కానీ, 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ‘అమ్మఒడి పథకం ఉన్నప్పుడు మధ్యాహ్న భోజనం ఎందుకు?’ అని చెప్పి ఆ పథకాన్ని నిలిపివేశారు. అప్పట్లో ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు గురైంది.
యువగళం (Yuvagalam) పాదయాత్రలో విద్యార్థులు లోకేశ్‌ను కలిసి ఈ పథకాన్ని మళ్లీ ప్రారంభించాలని కోరారు. అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని తిరిగి అమలు చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరుతో ఈ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది.
ఈ సందర్భంగా నారా లోకేశ్ (Nara Lokesh) మాట్లాడుతూ, ‘ రాజకీయాలు విద్యావ్యవస్థకు దూరంగా ఉండాలని, విద్యార్థుల పథకాల పేర్లకు పార్టీ రంగులు ఉండకూడదని’ తెలిపారు. డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని, సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో స్కూల్ కిట్లను ప్రారంభించడం ఈ దృక్పథానికే నిదర్శనమన్నారు. వైసీపీ హయాంలో విద్యార్థులను సమావేశాలకు తరలించేవారని, ఇకపై ఆ పరిస్థితి చోటు చేసుకోనీయమని లోకేశ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ పథకాన్ని అమలు చేయడంలో పూర్తి నిధుల కేటాయింపునకు ప్రాధాన్యత ఇచ్చారు.
ఈ ఏడాదికి రూ. 29.39 కోట్లు, 2024-25కి రూ. 85.84 కోట్లు కేటాయించి, రాష్ట్రంలోని 475 జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్యార్థులు డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రైవేటు సంస్థలతో పోటీపడేలా అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. నెటిజన్లు జగన్ మామయ్య తీసేసిన పథకాన్ని, లోకేశ్ అన్నయ్య తిరిగి ప్రవేశపెట్టారని ప్రశంసిస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా లోకేశ్ విద్యార్థుల మనసు గెలుచుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.













