ధర్మాడి సత్యాన్ని సత్కరించిన టీడీపీ
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిన రాయల్ వశిష్ఠ పర్యాటక బోటును వెలికితీసిన కాకినాడకు చెందిన ధర్మాడి సత్యాన్ని మాజీ హోంమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అభినందించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జగన్నాథపురంలో సత్యం నివాసానికి వెళ్లిన రాజప్ప ఆయనను సత్కరించారు. కష్టసాధ్యమైన బోటు వెలికితీత కార్యక్రమాన్ని మొక్కవోని ఆత్మ విశ్వాసంతో సుసాధ్యం చేసిన ధర్మాడి సాహసం మెచ్చుకోదగినదని రాజప్ప అన్నారు. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సత్యాన్ని అభినందిస్తూ పంపిన ప్రశంసాపత్రాన్ని అందజేశారు.













