Anantapur: అనంతపూర్ రాజకీయాలలో అలజడి సృష్టిస్తున్న దగ్గుబాటి వివాదం..
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)పై అనంతపురం (Anantapur) అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ (Daggubati Venkateswara Prasad) చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల ఆడియో బయటకు రావడంతో పెద్ద దుమారం చెలరేగింది. ఆ ఆడియో సోషల్ మీడియాలో విస్తృతంగా పాకిపోవడంతో అభిమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంటనే స్పందిస్తూ సెల్ఫీ వీడియో ద్వారా తాను అలాంటి మాటలు చెప్పలేదని, ఆ ఆడియో తనది కాదని చెప్పడంతో పాటు అభిమానులకు క్షమాపణ కూడా చెప్పారు. అయితే ఆయన ఇచ్చిన సారీతో వివాదం తగ్గిపోతుందనుకున్నా పరిస్థితి మరింత కఠినమైంది.
ఎమ్మెల్యే ఇంటి ముందు అభిమానులు చేరి నిరసనలు ప్రారంభించారు. అనంతపురంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ ఆందోళనల్లో పెద్ద ఎత్తున తారక్ అభిమానులు పాల్గొన్నారు. తరువాత హైదరాబాద్ (Hyderabad)లో కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ డిమాండ్లను వెల్లడించారు. ఎమ్మెల్యే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, టీడీపీ (TDP) ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే పార్టీ గానీ, ప్రభుత్వమే గానీ స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో అభిమానుల్లో నిరాశ పెరిగింది.
వివాదం జరిగి ఇప్పటికి పది రోజులు గడిచినా అభిమానుల ఆగ్రహం తగ్గలేదు. వారిని శాంతింపజేయడానికి ఎమ్మెల్యే నుండి ప్రత్యేకమైన ప్రయత్నం జరగకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఆదివారం రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు అనంతపురానికి చేరుకున్నారు. పోలీసుల నిరోధక చర్యల మధ్య కొందరు వాహనాల్లో, మరికొందరు వేరే మార్గాల ద్వారా అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఈ సమయంలో ఉద్రిక్తత పెరగడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అభిమానులను కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో పాకిపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. శాంతియుతంగా నిరసన తెలిపిన ఫ్యాన్స్‌పై దాడి చేయడం తగదని నెటిజన్లు పోలీసులపై ప్రశ్నలు లేవనెత్తారు. మరోవైపు పోలీసులు మాత్రం అభిమానుల ఆగ్రహం అదుపులోకి రాకపోతే శాంతిభద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక ఎమ్మెల్యే మాత్రం పెద్దగా స్పందించకుండా తన పనుల్లో బిజీగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఆయన నేరుగా బహిరంగ క్షమాపణ చెప్పేస్తే ఈ వివాదం ఇంత పెద్దదిగా మారకపోయేదని చాలామంది చెబుతున్నారు. కానీ ఇప్పటికే విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో చెప్పిన సారీ సరిపోతుందా? లేకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా క్షమాపణ చెప్పాలి అనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ సంఘటన తెలుగు దేశం పార్టీకి రాజకీయంగా ఇబ్బందులు కలిగించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. అభిమానుల ఆగ్రహం కొనసాగుతున్నందున, పార్టీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.







