తిరుపతిలో వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు భేష్
స్మార్ట్ సిటీల్లో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు బాగున్నాయ్.. మిగతా పట్టణాలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయ్.. అంటూ స్మార్ట్ సిటీ మిషన్ కితాబిచ్చింది. తిరుపతిలో కరోనా నియంత్రణ చర్యలు అద్భుతంగా ఉన్నట్టు పేర్కొంది. స్మార్ట్ నగరాల పనితీరును బట్టి సాధారణం, బాగా చేస్తున్నవి, అద్భుతంగా చేస్తున్నవి.. ఇలా మూడు గ్రేడ్లుగా విభజించి, అక్కడి సేవలను పరిశీలించి స్మార్ట్‌సిటీ మిషన్ ర్యాంకులిచ్చింది. మన రాష్ట్రంలో విశాఖ, అమరావతి, కాకినాడ, తిరుపతిలు స్మార్ట్ నగరాలు. ఈ నాలుగింటిలో తిరుపతికి మొదటి ర్యాంకు వచ్చింది. వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు ఇక్కడ బాగున్నట్టు తన నివేదికలో తేల్చింది. తిరుపతికి సంబంధించి విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల ఇళ్ల వద్ద మార్కింగ్ వేశారు. క్వారంటైన్ పర్యవేక్షణ బాగుంది. ఇంటింటికీ వెళ్లి నిత్యావసరాలు, కిరాణా సరుకులు అందజేస్తున్నారు. వార్డు సెక్రటరీలు, సిబ్బంది ఆయా వార్డుల్లో పటిష్టంగా, ప్రజలను నొప్పించకుండా సేవలందిస్తున్నారని నివేదికలో పేర్కొంది.













