సాగరతీరం ముస్తాబు…

ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖ అన్న వైసీపీ సర్కార్… దసరా నుంచే పాలనకు శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రుషికొండ దగ్గర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు సీఎస్ వచ్చి సూచనలు, సలహాలు అందించడం జరిగింది. దీనికి తోడు విశాఖకు వెళ్లేందుకు ఉద్యోగసంఘాలు సిద్ధమయ్యాయి. అమరావతి నుంచి విశాఖకు వెళ్లేందుకు ఉద్యోగులు సైతం ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
డిసెంబర్ నాటికి తాను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతానని క్లారిటీ ఇచ్చేశారు సీఎం జగన్. విశాఖ ఏపీ ఆర్థికరథానికి చోదకశక్తిగా అభివర్ణించారు. ఇలాంటి గొప్పనగరాలు.. దేశంలో చాలా తక్కువగా ఉన్నాయని జగన్ వివరించారు. ఏపీకన్న కలలను , పెట్టుకున్న ఆశలను తీర్చే శక్తి ఒక్క విశాఖకే ఉందన్నారు జగన్. అంతేకాదు.. విశాఖ నుంచి పాలించడం గర్వకారణమంటున్నారు సీఎం జగన్.
అంతేకాదు.. తనకు ఒక్క కాల్ చేస్తే చాలు అన్నిరకాల మౌలికసదుపాయాలు కల్పిస్తానంటూ ఇన్ఫోసిస్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా జగన్ తెలిపారు. భవిష్యత్తులో ఇంకా పెద్దఎత్తున పెట్టుబడులు వస్తాయంటున్నారు. విశాఖకు పారిశ్రామికవేత్తలు అంతా తరలిరావాలని ఆయన పిలుపు ఇచ్చారు. విశాఖ రాజధాని అని జగన్ చెప్పకుండానే చెప్పేశారు. విశాఖ ఏపీ భవిష్యత్తు అని ప్రకటించేశారు.
ఇప్పటివరకూ విశాఖ రాజధాని అని వైసీపీ సర్కార్ ప్రకటించినా .. స్థానికంగా పెద్దగా రియాక్షన్ ఉండడం లేదు. ఎందుకంటే.. విశాఖ వాసులు రాజధాని కన్నా ముఖ్యంగా అభివృద్ధిని కోరుకుంటున్నారు. తమ ప్రాంతం హైదరాబాద్ లా అభివృద్ధి చెందాలన్నది విశాఖ వాసుల కల. అయితే దాన్ని నెరవేర్చకుండా క్యాపిటల్ పేరుతో రాజకీయాలు జరుగుతున్నాయని విశాఖ వాసుల అనుమానంగా ఉంది.
ఇప్పటికి వైసీపీ సర్కార్ కు అసలు విశాఖ వాసులు ఏం అడుగుతున్నారన్నది అర్థమైనట్లుగా ఉంది. కాస్త ఆలస్యమైనా.. ఎన్నికల ముందు విశాఖలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. తాము విశాఖను క్యాపిటల్ గా మార్చడంతో పాటు అభివృద్ధిలోనూ దూసుకెళ్లేలా చేస్తామని చెబుతున్నారు. పరిపాలన రాజధానిగా ప్రకటించిన సర్కార్.. అప్పటి నుంచే పూర్తిస్థాయిలో విశాఖ అభివృద్ధిపై ఫోకస్ పెట్టి ఉంటే..ఈ పాటికే సాగరతీరంలో వైసీపీకి ఆదరణ మరింతగా పెరిగి ఉండేదని పక్కాగా చెప్పొచ్చు. కాస్త ఆలస్యంగా మొదలుపెట్టినా ఈ అభివృద్ధి కార్యక్రమాలను మరింతగా అమలు చేయాలని విశాఖ వాసులు కోరుతున్నారు.











































































