దేశంలో ఎక్కడ ఇలాంటి పథకం లేదు
వైఎస్ఆర్ లా నేస్తం పథకం నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 2023`24 సంవత్సరానికి మొదటి విడత వైఎస్ఆర్ లా నేస్తం కింద రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 2,677 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5 వేల స్టైఫండ్ చొప్పున ఫిబ్రవరి నుంచి జూన్ వరకు రూ.6,12,65,000 కోట్ల ఆర్థిక ప్రోత్సాహకాన్ని బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా వైఎస్ఆర్ లా నేస్తం అమలు చేస్తున్నామని తెలిపారు. ఇలాంటి పథకం, ఇలాంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో లేదని అన్నారు. కేవలంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇలాంటి పథకాన్ని చూస్తున్నారని తెలిపారు.
లా కోర్సు పూర్తి చేసిన వారు ప్రాక్టీసు పరంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉందని, వారికి తోడుగా నిలిచేందుకు వైఎస్ఆర్ లా నేస్తం తీసుకొచ్చామని తెలిపారు. వారికి ప్రతి నెలా రూ.5 వేల చొప్పున ఏడాదిలో రూ.60 వేలు ఇస్తున్నామని తెలిపారు. మూడేళ్లలో ఇలా ఒక్కొక్కరికీ రూ.1.8 లక్షలు, ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి దాకా 5,781 మందికి మేలు చేశామని, మొత్తంగా రూ.41.52 కోట్లు జూనియర్ లాయర్లకు ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వం తరపు నుంచి న్యాయవాదులను కోరేది ఒక్కటేనని అన్నారు. జూనియర్లుగా ఉన్న న్యాయవాదులకు ఈ పథకం వల్ల మంచి జరిగితే వీరు స్థిరపడ్డాక ఇదే మమకారం పేదలపట్ల చూపిస్తారని నమ్ముతున్నా. ఒక అన్నగా, ఒక స్నేహితుడిగా వారి దగ్గర నుంచి ఆశిస్తున్నది ఇదే. దీన్ని ఎప్పుడూ మరిచిపోవద్దని కోరుతున్నా అని చెప్పారు.













