వారికి వెంటనే రూ.5 లక్షల పరిహారం : వైఎస్ జగన్
వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే రూ.5 లక్షల పరిహారం అందించాలని అధికారులకు ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. వర్షాలు, కోవిడ్, వార్డు సెక్రటేరిట్స్ తనిఖీలు, నాడు-నేడు తదితర అంశాలపై ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కలెక్టర్లు మానవతా ధృక్పదంతో పనిచేస్తూ కూలిన ఇళ్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించి వెంటనే వారికి సహాయం అందించాలన్నారు. చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షల పరహారం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అక్టోబర్ 31 లోగా పంట నష్టాన్ని సంబంధించి అంచనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. బడ్జెట్ ప్రతిపాదనలు కూడా 31లోగా పూర్తి చేయాలని సూచించారు. కరెంట్ పునరుద్ధరణను వేగంగా చేపట్టినందుకు కలెక్టర్లను సీఎం జగన్ అభినందించారు. ఈ నెల 27న రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వెల్లడించారు.













