ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్ అప్పజెప్పడం భావ్యం కాదు : మోదీకి జగన్ లేఖ
ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్ మరోమారు లేఖ రాశారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్ ఇవ్వడం ఏమాత్రం సబబు కాదని, దీని వల్ల సామాన్యులు వ్యాక్సిన్ తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ నియంత్రణ లేకపోతే వ్యాక్సిన్ను బ్లాక్ మార్కెట్ చేస్తారని, సరిపడా వ్యాక్సిన్ స్టాక్ ఉంటే, ఎవరికైనా ఇవ్వొచ్చని పేర్కొన్నారు. ఓ వైపు వ్యాక్సిన్ కొరత ఉందని, అలాంటి సమయంలో ప్రైవేట్ ఆస్పత్రులకు ఎలా ఇస్తారని లేఖలో ప్రశ్నించారు. వ్యాక్సిన్లన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్దే ఉండాలని, బ్లాక్ మార్కెట్కు చేరకుండా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ అభిమతమని, కొరత వల్ల కొందరికే ఇస్తున్నామని వివరించారు. ప్రైవేట్ ఆస్పత్రులకు నేరుగా వ్యాక్సిన్ ఇవ్వడం తప్పుడు సంకేతాలనిస్తోందని, ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేక వస్తుందని సీఎం జగన్ తన లేఖలో పేర్కొన్నారు.













