జాబితా రెడీ..! 18 నుంచి జనంలోకి జగన్..!!
ఎన్నికల షెడ్యూల్ రేపు లేదా ఎల్లుండి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల కదనరంగంలోకి దూకేశాయి. షెడ్యూల్ విడుదలైన తర్వాత నెల రోజుల్లో పోలింగ్ జరుగుతుంది. 2019లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మొదటి విడతలోనే జరిగాయి. దీంతో ఈసారి కూడా అలాగే ఉంటుందనే ఉద్దేశంతో పార్టీలన్నీ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే వైసీపీ కూడా యుద్ధానికి సిద్ధమవుతోంది. ఇందుకోసం యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంది.
గత ఎన్నికల సమయంలో ఒకేసారి అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు వైసీపీ అధినేత జగన్. కానీ ఈసారి మాత్రం అలా జరగట్లేదు. ఇప్పటివరకూ దాదాపు 12 జాబితాలు రిలీజ్ చేశారు. అందులో నియోజకవర్గాల సమన్వయకర్తలను నియమించారు. వాళ్లే దాదాపు అభ్యర్థులని చెప్పారు. అయితే ఆ జాబితాల్లో ఎప్పటికప్పుడు పేర్లు మారిపోతూనే ఉన్నాయి. దీంతో నాయకుల్లోనే కాదు.. కేడర్ లో కూడా గందరగోళం నెలకొంది. అయితే ఇప్పుడు ఈ గందరగోళానికి చెక్ పెట్టాలని జగన్ నిర్ణయించారు.
ఈ నెల 16న ఇడుపులపాయలో పూర్తి స్థాయి అభ్యర్థుల జాబితా ప్రకటించాలని జగన్ నిర్ణయించారు. వైఎస్ సమాధి దగ్గర జాబితా ఉంచి ఆ తర్వాత అక్కడే లిస్ట్ అనౌన్స్ చేయనున్నారు. 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకూ ఆరోజే అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. అయితే ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఒక కొలిక్కి రాలేదు. ముఖ్యంగా ఉభయగోదావరి, గుంటూరు, విశాఖ జిల్లాల్లో గందరగోళం నెలకొంది. ఈలోపు ఈ జిల్లాల నేతలను తాడేపల్లి పిలిపించుకుని సెట్ చేయనున్నారు..
16న జాబితా ప్రకటించిన అనంతరం 18 నుంచి జగన్ ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఇచ్చాపురం నుంచి జగన్ ప్రచార యాత్ర ఉండేలా షెడ్యూల్ రెడీ అయింది. రోజుకు కనీసం 3 నియోజకవర్గాల్లో జగన్ యాత్ర ఉండేలా రోడ్ మ్యాప్ రెడీ చేశారు. దాదాపు 20 రోజులపాటు జగన్ పర్యటన సాగనుంది.













